పిడకల యుద్ధం..! ఎన్నో ఏళ్ల వింత ఆచారం..
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పాల గ్రామంలో శ్రీ భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగాది మరుసటి రోజు ఇక్కడ జరిగే పిడకల సమరం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం.. ఈ ఏడాది వేలాది మంది సమక్షంలో హోరాహోరీగా పిడకల సమరం సాగింది. ఈ సమరంలో దాదాపు 40 మంది స్వల్పంగా గాయపడ్డారు.
గాయపడ్డ వారు స్వామి వార్ల ఆలయానికి వెళ్ళి విభూతి రాసుకొని వెళ్ళిపోయారు. పిడకల సమరంలో హైలైట్ ఏంటంటే.. సంప్రదాయం ప్రకారం కారుమంచి నుంచి పెద్దరెడ్డి వంశస్తుడైన నందకీషోర్ రెడ్డి గుర్రంపై.. మందీ మార్బలం, తప్పెట్లు, మేళతాళాలతో కైరుప్పలకు వచ్చారు. దేవాలయంలోకి వెళ్లి పూజలు చేసి వెనుతిరిగారు. ఆపై పిడకల సమరం మొదలైంది. వీరభద్రస్వామి, కాళికాదేవి వర్గీయులు వేరు వేరుగా విడిపోయారు. పరస్పరం పిడకలతో దాడి చేసుకున్నారు. వందల సంఖ్యలో పిడకలు గాల్లోకి లేచి ప్రత్యర్థి వర్గంపై పడుతుంటే ఉత్సాహం రెట్టింపైంది. పిడకల దుమ్ము అకాశాన్నంటింది. తమను తాము రక్షించుకుంటూ ఎదుటి వారిపై పిడకలు విసురుకుంటూ గుంపులు, గుంపులుగా ప్రజలు కదిలారు. ఒక సారి ఒక వర్గం వారిది పైచేయి అయితే, మరో సారి మరో వర్గం వారిది పైచేయిగా నిలిచింది. తమ వర్గం వారు గెలవాలనే తపనతో మహిళలు పిడకలు అందిస్తూ సాయంగా నిలిచారు. కుప్పగా వేసిన పిడకలు అయిపోయేంత వరకు అరగంట పాటు పోరు కొనసాగింది. ఇక ఈ పిడకల సమరంలో దెబ్బలు తగిలిన వారు స్వామి వారి విబూదిని అంటించుకుని వెళ్లారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు కైరుప్పల చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు తరలి వచ్చారు.. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక టీ 65 వేలు, నీళ్ల బాటిల్ 50 వేలు.. ఆ రెస్టారెంట్ బిల్లుతో పట్టపగలే చుక్కలు