వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట

Updated on: Dec 27, 2025 | 9:03 PM

వరుస సెలవులు, న్యూ ఇయర్ కారణంగా తిరుమల, శ్రీశైలం, వేములవాడ ఆలయాల్లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తిరుమలలో సర్వదర్శనానికి 30 గంటలు పడుతోంది. దీంతో టీటీడీ శ్రీవాణి ఆఫ్‍లైన్ టికెట్ల జారీని రద్దు చేసింది. వాహనాలు, పార్కింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. భక్తులు ఇష్టదైవ దర్శనం కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు.

అసలే వరుస సెలవులు. ఆపై న్యూ ఇయర్‌ జోష్‌. ఇంకేముంది జనం క్యూ కట్టారు. ఆలయాల బాటపట్టారు. ఏ టెంపుల్‌ చూసినా రద్దీగా కనిపిస్తోంది. ఏ పుణ్యక్షేత్రం చూసినా ఫుల్‌ రష్‌. ఇష్టదైవాన్ని క్షణకాలంపాటు దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఏడుకొండలు కిటకిటలాడుతున్నాయి. తెలుగురాష్ట్రాలే కాదు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తిరుమలకు వస్తున్నారు. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. రద్దీ ఎలా ఉందంటే, శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్ ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. ఈ క్రమంలో భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబ‌ర్ 27, 28, 29 మూడు రోజుల పాటు శ్రీ‌వాణి ఆఫ్ లైన్ దర్శన టికెట్ల జారీని ర‌ద్దు చేసింది. భక్తుల రద్దీ తగ్గిన తర్వాత మళ్లీ యథావిధిగా టోకెన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. అటు తిరుమల అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లకు భక్తులు పోటెత్తారు. సర్వ దర్శనం టోకెన్లు పూర్తి కావడంతో నడకదారి భక్తుల దివ్య దర్శనం టోకెన్లకు భారీగా ఎగబడ్డారు. దాంతో టీటీడీ సెక్యూరిటీ, పోలీసు సిబ్బంది అలర్ట్ అయ్యారు. క్యూలైన్లలో తోపులాటలు జరగకుండా పరిస్థితిని అదుపు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి క్యూలైన్లు వెలుపలకు వచ్చాయి. శిలాతోరణం వరకు కూడా సర్వ దర్శనం క్యూలైన్లు ఉన్నాయి. దీంతో స్వామి వారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. నారాయనగిరి ఉద్యానవనంలోని షెడ్లు కూడా నిండిపోయాయి. నారాయణగిరి దాటి శిలాతోరణం వరకు క్యూ లైన్ ఉంది. ఇక్కడి నుంచి ఆక్టోపస్ భనవం వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్ ఉంది. దీంతో, భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. వరుస సెలవులు, ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి కారణంగా వచ్చే నాలుగైదు రోజులు రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు, తిరుమలకు వెళ్లే వాహనాలతో అలిపిరి కిక్కిరిసిపోతోంది. దీంతో కొండపై పార్కింగ్ సమస్య తలెత్తుతోంది. మూడు రోజులుగా రోజుకు 12 వేల ఫోర్ వీలర్స్ తిరుమలకు వెళుతుండగా.. సప్తగిరి తనిఖీ కేంద్రం వందలాది వాహనాలు దారులు తీరాయి. వాహనాల రద్దీని కంట్రోల్ చేసేందుకు టీటీడీ సెక్యూరిటీ, తిరుపతి జిల్లా పోలీసులు శ్రమిస్తున్నారు. ఇటు శ్రీశైలంలోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో శ్రీగిరి క్షేత్రం “ఓం నమఃశివాయ” నామస్మరణతో మార్మోగుతోంది. శ్రీశైలంలో అధికారులు ఇష్టారాజ్యంగా స్పర్శ దర్శనం టికెట్ల జారీ చేశారు. దీంతో సామర్ధ్యానికి మించి భక్తులు రావటంతో స్పర్శ దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. దీంతో అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్రిస్మస్ సెలవులు కావటం, సమ్మక్కసారక్క జాతరకు ముందు వేములవాడ ఆలయాన్ని సందర్శించుకోవటం ఆనవాయితీ కావటంతో భారీగా భక్తులు వచ్చారు. రాజన్న ప్రధాన ఆలయం అభివృద్ధి దశలో ఉండడంతో.. అనుబంధ దేవాలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్

2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే

బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??

హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??

ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టులు