పేకాట రాయుళ్లకు కోర్టు.. శ్రీకాకుళం కోర్ట్ వినూత్న శిక్ష

Updated on: Nov 11, 2025 | 4:30 PM

శ్రీకాకుళం కోర్టు జూదం, మద్యపానం వ్యసనాలపై వినూత్న తీర్పు ఇచ్చింది. పేకాట ఆడుతూ పట్టుబడిన ఐదుగురికి జరిమానాతో పాటు 10 రోజులు ప్లకార్డులతో సామాజిక సేవా శిక్ష విధించింది. బహిరంగ మద్యపానం కేసులో ఒకరికి 30 రోజుల జైలు శిక్ష పడింది. ఈ చర్యలు వ్యసనాల కుటుంబ, సామాజిక ప్రభావాలపై అవగాహన పెంచడం, చట్టాన్ని గౌరవించడమే లక్ష్యంగా ఉన్నాయి.

జూదం, మద్యపానం వంటి వ్యసనాలకు బానిస కావద్దని ఎంత చెప్పినా కొందరు పెడచెవిన పెడుతూనే ఉన్నారు. ప్రభుత్తం ఎన్ని చర్యలు తీసుకున్నా మారని ఇలాంటి వాళ్ళ విషయంలో కాస్త కటువుగానే వ్యవహరించాలనుకున్న కోర్టు వినూత్నమైన తీర్పు ఇచ్చింది. శ్రీకాకుళం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతూ పట్టుబడిన ఐదుగురు వ్యక్తులకు జరిమానాతో పాటు సామాజిక సేవా కార్యక్రమం చేయాలని కోర్టు ఆదేశించింది. జూదం మరియు మద్యపానం వలన వ్యక్తిగత,కుటుంబ, సామాజిక జీవితాలు దెబ్బతింటున్న నేపథ్యంలో పేకాట ఆడుతూ పట్టుబడిన ఐదుగురు వ్యక్తులపై నమోదైన కేసుపై విచారణ జరిపిన శ్రీకాకుళం సెకండ్ క్లాస్ కోర్టు మెజిస్ట్రేట్ కె. శివరామకృష్ణ బుధవారం తీర్పు వెలువరించారు. పేకాటలో పట్టుబడిన ఐదుగురు వ్యక్తులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల జరిమానా తోపాటు, పది రోజులు శ్రీకాకుళం పట్టణం ప్రధాన జంక్షన్లలో నిలబడి.. జూదం నిషేధము, బహిరంగ ప్రదేశంలో మద్యపానం నిషేధము.. వంటి ప్లకార్డులు ఉదయం సాయంత్రం ప్రదర్శించాలని మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారు. కోర్టు తీర్పు ప్రకారం.. గురువారం శ్రీకాకుళం పిఎస్అర్ కూడలి వద్ద శ్రీకాకుళం DSP వివేకానంద,వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో సదరు ఐదుగురు వ్యక్తులు ఆ ప్లకార్డులు పట్టుకుని రోజంతా నిలబడ్డారు. జూదం, మద్యపానం వంటివి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతాయిని, అందుకే వీటికి దూరంగా ఉండాలని,చట్టాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పైడిపు నాయుడు, టూ టౌన్ సీఐ ఈశ్వరరావు, ట్రాఫిక్ సిఐ నాగరాజు ,వన్ టౌన్ ఎస్సై హరికృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని మిల్లీ జంక్షన్ వద్ద బుధవారం సాయంత్రం బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ, వచ్చి పోయే ప్రజలకు ఇబ్బంది కలిగించిన కాగన గణేష్ అనే వ్యక్తిని శ్రీకాకుళం వన్ టౌన్ పోలీసులు పట్టుకుని ఓపెన్ డ్రింకింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం గురువారం శ్రీకాకుళం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, మెజిస్ట్రేట్ కె. శివరామక్రిష్ణ 30 రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రేమించలేదని పగబట్టి.. జైలు పాలైన లేడీ కిలాడీ

Elon Musk: చరిత్ర సృష్టించబోతున్న ఎలన్‌ మస్క్‌

Vizag: వెబ్‌సైట్లు,యూట్యూబ్‌లో సెర్చ్ చేసి అత్తను హత్య చేసిన కోడలు

చిరంజీవి రికార్డును బీట్ చేసిన చరణ్.. మొత్తానికి ఊపుమీదున్న తండ్రీకొడుకులు

Reliance Jio: జియో కీలక నిర్ణయం.. జెమినీ AI ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ