ఇళ్లకు తలుపులే లేని గ్రామం.. మరి దొంగలు పడితే..?

Updated on: Sep 21, 2025 | 12:44 PM

మనం ఇంటినుంచి బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లో ఇంకెవరూ లేకపోతే ఇంటికి తాళం వేసి వెళ్తాం. అది సరిగా పడిందో లేదోనని పదిసార్లు చెక్‌ చేసుకుంటాం.. రాత్రివేళ నిద్రపోయేముందు ఇంటి తలుపు క్లోజ్‌ చేసి గడియ పెట్టామా లేదా అని ఒకటికి రెండుసార్లు చూసుకుంటాం. కానీ ఓ గ్రామంలో అసలు ఇంటికి తాళాలే వెయ్యరు అంటే నమ్ముతారా? మీరనుకున్నట్టు షిరిడీ దగ్గర శనిసింగనాపూర్‌లో ఇది మామూలే అనుకుంటే పొరపాటే.. ఇది అక్కడ కాదు.. మరో గ్రామం.

అక్కడి గ్రామస్తులు ఇల్లు వదిలి వేరే ఊళ్లకు వెళ్లినా వారి తలుపులకు తాళం వెయ్యడం కాదు అసలు వాళ్ల ఇళ్లకు తలుపులే ఉండవంటే నమ్ముతారా..? ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో ఉన్న సియాలియా గ్రామంలోని ఏ ఇంటికీ తలుపులుగానీ, ద్వారబంధాలుగానీ ఉండవు. అయినా ఈ గ్రామంలో ఒక్క దొంగతనం కూడా జరగదు. ఏ ఇంట్లోనూ, పడకగది, వంటగది సహా ఏ గదికీ తలుపులు ఉండవు. చెక్క ఫ్రేములు లేదంటే పరదాలు మాత్రమే అడ్డుగా వేసుకుంటారు. తమ గ్రామ దేవత అయిన ఖరాఖైదేవి ఉండగా ఏ దొంగా తమ ఇళ్లలో అడుగుపెట్టే ధైర్యం చేయ్యలేరని వారు నమ్ముతారు. తమను, తమ ఆస్తులను ఎల్లప్పుడూ ఆ అమ్మవారు కాపాడుతుందని గ్రామస్థులు బలంగా విశ్వసిస్తారు. తరతరాలుగా తలుపులు లేని ఇళ్లలోనే గ్రామస్తులు నివసిస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఆ గ్రామంలో ఊరికి ఉత్తరాన ఉన్న ఖరాఖైదేవి ఆలయంలోని గర్భగుడికి పైకప్పు ఉండదు. అమ్మవారికి సూర్యరశ్మి అంటే ఇష్టమట. అందుకే అలా పైకప్పు లేకుండా ఉంచామని స్థానికులు చెబుతారు. గ్రామస్థుల నమ్మకానికి తగ్గట్టే, సియాలియాలో ఇప్పటివరకు ఒక్క చోరీ కేసు కూడా నమోదు కాలేదని స్థానిక పోలీసులు సైతం ధ్రువీకరించారు. తమ గ్రామ ప్రత్యేకతను గుర్తించి, దీనిని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు పర్యాటక శాఖకు ఒక లేఖ కూడా రాశారు. గ్రామస్థుల వినతిని ప్రభుత్వానికి పంపామని జిల్లా పర్యాటక అధికారి తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో… వచ్చే ఏడాది అలా జరగబోతుందా? బాంబు పేల్చిన బాబా వంగా!