స్వాతంత్రం వచ్చాక తొలిసారిగా వెలిగిన కరెంటు బుగ్గ
వాళ్లంతా అమాయక ఆదివాసీలు..కొండ శిఖర గ్రామంలో నివాసం..దశాబ్దాలుగా వాళ్ళు చేస్తున్న పోరాటం ఫలించింది..అంధకారంలో మగ్గిన వాళ్లందరి జీవితాల్లో వెలుగులు వచ్చాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 78 ఏళ్లకు ఆ గూడానికి కరెంటు రావడంతో వారి సంబరాలు అంబరాన్నంటాయి. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ మారుమూల గూడెం కొండ శిఖర గ్రామం.
అక్కడ నూక దొర తెగకు చెందిన 18 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. తమ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కావాలని ఆ గ్రామస్తులు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. అయినా.. ప్రభుత్వాల నుంచి ఎలాంటి చొరవా లేకపోవటంతో, ఇటీవల ఆ గ్రామస్తులు కాగడాల కొట్టుకొని ఆందోళన చేశారు. దీంతో అధికారులు ఎట్టకేలకు స్పందించి.. వాహనాలు కూడా వెళ్ళని ఆ గ్రామాన్ని కాలినడకన వెళ్లి పరిస్థితిని చూశారు. విద్యుత్ పనులు ప్రారంభించి, నెలరోజుల వ్యవధిలోనే ఆ గ్రామానికి కరెంటు సౌకర్యం కల్పించారు. ఒకవేళ విద్యుత్ లైన్ కు అంతరాయం కలిగినా.. ప్రత్యామ్నాయంగా సోలార్ ఉండాలనే ఉద్దేశంతో సోలార్ వ్యవస్థనూ ఏర్పాట్లు చేశారు. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు గడిచినా విద్యుత్ వెలుగులకు నోచుకోని ఆ గ్రామస్తులు.. ప్రభుత్వం చొరవతో సంతోషంలో మునిగిపోయారు. విద్యుత్ కాంతులతో మెరుస్తున్న తమ గ్రామం అంతా తిరిగి తెగ మురిసిపోయారు. అందరూ ఒకచోట చేరి సంబరాలు చేసుకున్నారు. తమ గ్రామంలో కాగడాలు, కిరోసిన్ దీపాల వెలుగుల స్థానంలో విద్యుత్ కాంతుల వెలుగులు తెచ్చిన ప్రభుత్వానికి గిరిజనులు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rhino: కొమ్ములో విషం.. స్మగ్లర్లకు శాపం..
ఇంకా పట్టాలెక్కని వందే భారత్ స్లీపర్ రైళ్లు.. ఎందుకు లేటు
నేను ఐఏఎస్‌ను.. ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా వచ్చాను
