300 ఏళ్ల తర్వాత రామప్ప ఆలయంలో అరుదైన ఘట్టం..
తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప ఆలయంలో మూడు శతాబ్దాల తర్వాత శివలింగానికి మళ్లీ నిత్యాభిషేకాలు ప్రారంభమయ్యాయి. 17వ శతాబ్దంలో భూకంపం కారణంగా గర్భగుడిలోని సోమసూత్రం మూసుకుపోవడంతో అభిషేకాలు నిలిచిపోయాయి. తాజాగా 3D మ్యాపింగ్, ఎండోస్కోపిక్, జియో ప్రో కెమెరాల పర్యవేక్షణలో సాఫ్ట్ డ్రిల్లింగ్ ద్వారా అడ్డంకులను తొలగించి సోమసూత్రాన్ని విజయవంతంగా పునరుద్ధరించారు.
తెలుగు రాష్ట్రాలలో యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక చారిత్రక ఆలయం ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని కాలంలో ఆయన సేనాధిపతి రేచర్ల రుద్రుడు క్రీ.శ. 1213లో అద్భుత శిల్పకళతో సుమారు 40 సంవత్సరాలు శ్రమించి ఈ ఆలయాన్ని నిర్మించారు. భారతదేశంలో ఒక శిల్పి పేరు మీద పిలువబడుతున్న ఏకైక చారిత్రక ఆలయం ఇదే కావడం విశేషం. పూర్తిస్థాయిలో సాండ్ బాక్స్ టెక్నాలజీ, నీటిపై తేలే ఇటుకలతో నిర్మించడం వల్ల ఎంతటి భారీ భూకంపాలనైనా తట్టుకునే పటిష్టత ఈ ఆలయ సొంతం. ఈ శిల్ప సంపదను గుర్తించిన యునెస్కో 2021లో రామప్పకు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇంతటి వైభవోపేతమైన రామప్ప ఆలయంలో గత మూడు వందల ఏళ్లుగా శివలింగానికి నిత్య అభిషేకాలు జరగలేదంటే నమ్మగలరా? కానీ అది అక్షరాలా నిజం. 17వ శతాబ్దంలో సంభవించిన భారీ భూకంపం కారణంగా గర్భగుడిలోని ‘సోమసూత్రం’ పూర్తిగా మూసుకుపోయింది. నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో అప్పట్లో అర్చకులు అభిషేకాలు నిలిపివేశారు. నాటి నుంచి నేటి వరకు ఇక్కడి శివయ్య జలాభిషేకానికి నోచుకోలేదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూసేందుకు ఇటీవలే శాస్త్రీయ పద్ధతిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. 3D మ్యాపింగ్, ఎండోస్కోపిక్, జియో ప్రో కెమెరాలు మరియు రియల్ టైమ్ మానిటరింగ్ స్క్రీన్ల పర్యవేక్షణలో పనులు చేపట్టారు. దేవదాయ శాఖ, కేంద్ర పురావస్తు శాఖ అధికారులు, ఇంటాక్ ప్రతినిధుల సమక్షంలో ఈ పునరుద్ధరణ జరిగింది. ఆలయ నిర్మాణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ‘సాఫ్ట్ డ్రిల్లింగ్’ విధానంలో పొరలు పొరలుగా అడ్డంకులను తొలగించి ఎట్టకేలకు సోమసూత్రాన్ని విజయవంతంగా తెరిచారు. మూడు శతాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత రామప్పఆలయంలోని శివయ్యకు మళ్లీ నిత్య అభిషేకాలు, పూజలు ప్రారంభం కావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోలేరమ్మ గుడిలో అద్భుతం.. అమ్మవారి విగ్రహంపై మరో రెండు కళ్లు ప్రత్యక్షం
పేకమేడల్లా కూలుతున్న భవనాలు.. హస్తినలో డేంజర్ బెల్స్
