ఆ దీవిలో అడుగు పెడితే చంపేస్తారు!

Updated on: Sep 14, 2025 | 1:31 PM

ఆదిమకాలం తర్వాత మానవుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లాడు. ఒక తెగ మరో ప్రాంతానికి వెళ్తే, తమ భూభాగం ఆక్రమణకు గురికాకుండా అక్కడి వారు ప్రతిఘటించేవారు. ఈ క్రమంలో యుద్ధాలు చేసేవారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న సెంటినలీస్ తెగకు చెందినవారు ఇప్పటికీ అదే ఆలోచనా విధానంతో ఉన్నారు. ఎవరైనా తమ ప్రాంతానికి వెళ్తే దండెత్తినట్టుగానే భావిస్తూ వారిపై యుద్ధానికి దిగుతారు.

తమ ద్వీపానికి సమీపంగా ఎవరు వచ్చినా సరే, దాడిచేసి చంపేస్తారు. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలూ లేకుండా పూర్తి సెపరేట్ గా ఈ తెగ జీవిస్తోంది. చరిత్రలో చాలా మంది ఈ ద్వీపాన్ని చేరుకోవడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అనేకమంది మత్స్యకారులు కూడా ఉన్నారని అంచనా. సెంటినలీస్ తెగ అత్యంత అరుదైనదిగా గుర్తించిన భారత ప్రభుత్వం, ఆ తెగ రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది. నార్త్ సెంటినెల్ దీవిని “గిరిజన పరిరక్షణ ప్రాంతం”గా ప్రకటించింది. దీని ప్రకారం ఆ దీవి నుంచి 5 కిలోమీటర్ల దూరం వరకు ఎవరూ ప్రవేశించడానికి వీల్లేదు. ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్‌ ప్రత్యేకంగా గస్తీ నిర్వహిస్తూ ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన పరిధి దాటి ఇతరులు ఎవరూ సెంటినల్ ఐలాండ్ వైపు వెళ్లకుండా చూస్తూ ఉంటుంది. తీర ప్రాంత రక్షణతో పాటుగా వీరి రక్షణ బాధ్యతలు కూడా పర్యవేక్షిస్తుంది. సెంటినలీస్​ తెగ చేతిలో రీసెంట్​గా ఒక అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు . అతని పేరు జాన్ అలెన్ చౌ. గతంలో పలుమార్లు అండమాన్​ నికోబార్​ను సందర్శించిన జాన్, ఆ తర్వాత బఫర్​ జోన్​గా ప్రకటించిన సెంటినల్ దీవిలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు. అక్రమంగా ఆ దీవికి చేరుకున్నాడు. మత్స్యకారులతో కలిసి నిషేధిత ప్రాంతం వరకు వెళ్లిన అలెన్, ఆ తర్వాత ఒక్కడే చిన్న పడవలో ప్రయాణించి సెంటినలీస్​ను కలుసుకున్నాడు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియదుగానీ గిరిజనులు అతన్ని చంపేసి, పాతిపెట్టారు. ఈ విషయాన్ని దూరంగా ఉన్న మత్స్యకారులు గమనించి, అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై హత్యకేసు నమోదైంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ, వారిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశ్యంతో వదిలేశారు. క్రైస్తవ మత ప్రచారకుడైన జాన్, అక్కడి వారికి క్రైస్తవాన్ని బోధించేందుకు వెళ్లారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సెంటినలీస్ లాంటి తెగలు ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నాయని చెబుతారు. ఎక్కువగా బ్రెజిల్, బొలీవియా, ఈక్వెడార్, పెరు వంటి దేశాల పరిధిలో విస్తరించి ఉన్న అమెజాన్ అడవుల్లో, ఇంకా గినియా దీవుల్లో జీవిస్తున్నారు. ప్రస్తుతం జనాభా లెక్కల సేకరణకు సిద్ధమవుతున్న అండమాన్, నికోబార్‌ దీవుల పాలనా యంత్రాంగం.. పురాతన తెగ అయిన సెంటినీలస్‌నూ ఈ కసరత్తులోకి తీసుకురానుంది. వారి దగ్గరకు వెళ్లకుండా దూరం నుంచే జనగణన చేపట్టాలని భావిస్తోంది. ఆ దీవిలోకి వెళ్లకుండానే నాన్‌ ఇన్వేజివ్‌ థర్మల్‌ సెన్సస్‌ పద్ధతిలో ఈ జాతి జనాభా లెక్కలను సేకరించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇందులోని థర్మల్‌ ఇమేజింగ్‌ వ్యవస్థ.. ఒక వ్యక్తికి సంబంధించిన ఉష్ణ సంకేతాన్ని గుర్తించి, లెక్కిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉపవాసంతో గుండె వ్యాధుల ముప్పు 135% ఎక్కువట

అద్భుతం.. ఐదు రంగుల నదిని చూసారా?