హాస్టల్‌లో దెయ్యం..! భయంతో ఖాళీ చేసి వెళ్లిపోయిన విద్యార్ధినిలు
మహారాష్ట్రలోని మారుమూల మెల్‌ఘాట్ ప్రాంతంలోని బాలికల హాస్టల్‌లో కలకలం రేగింది. సుమారు 15 మంది బాలికలు వింతగా ప్రవర్తించడం, కొందరు నవ్వడం, ఏడవడం, గజ్జెల శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పడంతో దెయ్యం ఉందంటూ వదంతులు వ్యాపించాయి. భయంతో 600 మందికి పైగా విద్యార్థినులు హాస్టల్‌ను వీడి ఇళ్లకు వెళ్లారు. అయితే అధికారులు దెయ్యం లేదని స్పష్టం చేయగా, వైద్యులు ఇది హిస్టీరియా తరహా మానసిక ప్రతిస్పందన కావచ్చని తెలిపారు.
మహారాష్ట్ర మెల్‌ఘాట్..మామూలుగానే అది మారుమూల గిరిజన ప్రాంతం. జనసంచారం తక్కువ. రాత్రయితే పురుగు కూడా అక్కడ కనిపించదు. అలాంటి చోట ఓబాలికల హాస్టల్. పగలే ఆ హాస్టల్ చూసేందుకు భయంకరంగా ఉంటుంది. ఇక రాత్రయితే… పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. అక్కడి పిల్లల చదువుకు అదే ఆధారం. అలాంటి హాస్టల్‌లో ఒక్కసారిగా ఓ 15 మంది బాలికలు వింతగా ప్రవర్తించడం కలకలం రేపింది.. కొందరు నవ్వుతూ.. మరికొందరు ఏడుస్తూ.. ఇంకొందరు తమకు గజ్జెల శబ్దాలు వినిపిస్తున్నాయంటూ చెప్పడంతో అసలు ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. దీనికి తోడు “హాస్టల్‌కు దెయ్యం పట్టిందంటూ” కొద్ది రోజులుగా ఊరంతా జోరుగా ప్రచారం సాగింది. ఈ వదంతి ఒకరి నుంచి మరొకరికి పాకి, హాస్టల్‌లో ఉంటున్న వందలాది మంది విద్యార్థినులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. కొందరు విద్యార్థులు వింత చేష్టలతో తోటివారిని మరింత భయపెట్టసాగారు. ఈ దెయ్యాల భయం చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకడంతో, భయంతో వణికిపోయిన విద్యార్థినుల తల్లిదండ్రులు వారిని ఇళ్లకు తీసుకెళ్లారు. ఇలా భయంతో ఇప్పటివరకు ఏకంగా 600 మందికి పైగా బాలికలు హాస్టల్‌ను వీడి వెళ్లిపోయారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు హాస్టల్‌లో ఎలాంటి దెయ్యం లేదని స్పష్టం చేశారు. బాలికల ఈ వింత ప్రవర్తనకు దెయ్యాలు కారణం కాదని, ఇదొక ‘హిస్టీరియా’ తరహా మానసిక ప్రతిస్పందన కావచ్చని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వైద్య బృందాలు హాస్టల్‌ను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడటంతో పాటు తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇస్తున్నాయి. మరోవైపు, ప్రజాసంఘాలు కూడా రంగంలోకి దిగి విద్యార్థినుల మనసులోని భయాన్ని పోగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
