Jaya Kishori: ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!

|

Nov 05, 2024 | 12:32 PM

నిండా 30 ఏళ్లు కూడా ఉండని ఓ యువతి. ఓ చేతిలో ఐఫోన్.. మరో చేతిలో 2 లక్షల ఖరీదైన హ్యాండ్ బ్యాగ్. ఎయిర్ పోర్టుల్లో కనిపిస్తారు. ముంబై లాల్ బాగ్‌లో ప్రత్యక్షమవుతారు. వివిధ రాష్ట్రాల మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు.. వీవీఐపీలు. ప్రతి ఒక్కరూ ఆమెను అవకాశం వచ్చినప్పుడల్లా కలుస్తుంటారు.. ఫోటోలు దిగుతుంటారు. మరో ముఖ్యమైన విషయం మీకు చెప్పడం మర్చిపోయా.. వీళ్లందరితో పాటు వేలు, లక్షల మంది చిన్నా, పెద్దా.. ఆమె మాటలు విని మైమరిచిపోతుంటారు.

1995 జులైలో రాజస్థాన్‌లోని సుజన్‌గఢ్‌లో జన్మించారామె. కుటుంబంలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అందుకే కిశోరీ ఆధ్యాత్మిక ప్రయాణం ఏడేళ్లకే మొదలైంది. భక్తి పాటలు, ఆధ్యాత్మిక ప్రసంగాలతో లక్షలాది మందిని ఆకర్షించి అభినవ మీరాబాయి అన్న పేరు కూడా తెచ్చుకున్నారు.

మహాదేవి బిర్లా వరల్డ్ అకాడమీలో విద్యనభ్యసించిన జయా కిశోరి.. తన ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూనే కోల్‌కతాలోని శ్రీ శిక్షాయతన్ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పట్టా అందుకున్నారు. అప్పట్లో సోనీ టీవీలో వచ్చే చిన్నారుల కార్యక్రమం బూగీ వూగీలో శాస్త్రీయ నృత్య ప్రదర్శన కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 20కి పైగా ఆధ్యాత్మిక ఆల్బమ్స్‌ ఆలపించారు. శివ స్తోత్ర, సుందర్‌కాండ్, భజనలతో అభిమాన శ్రోతలను సంపాదించుకున్నారు. ఇక ఆమె

మేరీ ఝోప్పిడీకే భాఘ్ ఆజ్ ఖోలే జాయేంగే.. రామ్ ఆయేంగే.. అంటూ పాట పాడుతుంటే… ఆ కార్యక్రమానికి హాజరైన భక్తులు తన్మయత్వంలో మునిగి తేలుతుంటారట. రామాయణ, మహాభారత, భాగవత, భగవద్గీతల నుంచి ఉదాహరణలతో వ్యక్తిత్వ వికాస పాఠాలు బోధిస్తుంటే.. లక్షలాది మంది నిరాశ, నిస్పృహలనుంచి బయటపడుతున్నారట.

జస్ట్ కొన్ని నెంబర్స్ మీకు చెబుతా.. ఆమెకు ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటోందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇన్ స్టాలో ప్రస్తుతానికి ఆమెకున్న ఫాలోయర్ల సంఖ్య 12.3 మిలియన్లు. ఫేస్ బుక్‌లో 8.9 మిలియన్, ట్విటర్.. అదే ఎక్స్ ప్లాట్ ఫాంలో లక్షా 40 వేల మందికి పైగా ఫాలోయర్లున్నారు. ఇక యూట్యూబ్ విషయానికి వస్తే ఆమె పేరుతో ఉన్న మొత్తం ఛానెళ్లన్నీ కలిపితే సుమారు 10 మిలియన్ల వరకు ఫాలోయర్లున్నారు.

ఈ నెంబర్లు సరిపోవా.. జయా కిశోరీ ఆధ్యాత్మిక భోదనలకు జనం ఎంత ఫిదా అవుతున్నారో చెప్పడానికి. ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్‌లో భాగంగా సెలెబ్రెటీ క్రియేటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రధాని మోదీ చేతుల మీదుగా అందుకున్నారు. ఇవి కాకుండా ఆమె అందుకున్న అవార్డులు ఇంకా చాలా చాలా ఉన్నాయి. అన్ని వయసుల వారు కనెక్ట్‌ అయ్యేలా సందేశాలు ఇవ్వగలగడం జయా కిశోరి ప్రత్యేకత. మనిషి విజయంలో కీలక పాత్ర పోషించే సహనం, స్థిరత్వం, ప్రశాంత చిత్తం వంటి ప్రధాన అంశాల గురించి తరచూ ప్రసంగాల్లో ప్రస్తావిస్తుంటారు.

లాస్ట్ .. బట్ నాట్ లీస్ట్.. తాజాగా ఆమె వార్తల్లోకి రావడానికి విమర్శల పాలవడానికి కారణం.. ఆమె 2 లక్షల విలువైన లగ్జరీ బ్యాగును ధరించి ఎయిర్ పోర్టులో కనిపించడం. ఆధ్యాత్మిక భోదలు సల్పే ఆమె.. అంత ఖరీదైన లెదర్ బ్యాగును వాడటం ఏంటి.. అని..? అందుకు ఆమె చెప్పిన సమాధానం అంతే క్రిస్టల్ క్లియర్‌గా ఉంది. ఆధ్యాత్మిక బోధనలు చేస్తున్నంత మాత్రాన.. తానేం సన్యాసిని కాదని, సర్వం వదిలేసి.. తిరగడం లేదని, తాను మాములు ఆడపిల్లనేనని చెప్పారు. గృహస్థ జీవనాన్నే గడుపుతున్నానని కూడా స్పష్టం చేశారు. అన్నీ వదిలేసి ఉండాలని తానెప్పుడు ఎవ్వరికీ బోధించలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.