ముస్లిం సమాధి వద్ద ఆగే జగన్నాథుడి రథం..ఎందుకో తెలుసా?వీడియో
ప్రపంచ ప్రఖ్యాత పూరి జగన్నాథ రథయాత్రా కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాదు. దీనిని సామరస్యతకు, ఐక్యతకు, భక్తికి చిహ్నంగాను భక్తులు భావిస్తారు. ఈ వేడుకలో భాగంగా జగన్నాధుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రలు తమ తమ రథాలపై నగర పర్యటనకు వెళతారు. ఈ క్రమంలో ఆ రథాలు గుడి నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న జగన్నాధుడి ముస్లిం భక్తుడు సాలబేగా సమాధి వద్ద క్షణం ఆగి ఆ తర్వాతే ముందుకు కదులుతాయి. దీని వెనుక ఒక పౌరాణిక కథ కూడా ఉందని చెబుతారు.
ముఘల్ సుబేదార్ కుమారుడు సాలబేగా పూరి జగన్నాధుడి మహిమను విని స్వామిని దర్శించుకోవాలని మందిరానికి వెళతాడు. అయితే హైందవ వేతరులకు ఆలయ ప్రవేశం లేదంటూ అధికారులు ఆయనను లోపలికి వెళ్ళనీయకపోవడంతో నిరాశపడతాడు. నాటి నుంచి స్వామి మీద ఆసక్తి, భక్తిగా మారి నిరంతరం జగన్నాధుని పూజిస్తూ భజనలు, కీర్తనలు పాడటం మొదలుపెడతాడు. ఒక ఏడాది రథయాత్ర సమయానికి సాలబేగా జబ్బుపడతాడు. లేవలేకపోతాడు. ఇంటి ముందు నుంచి స్వామి రథం వెళుతున్నా చూడలేకపోయాడని తెగ బాధపడిపోతాడు. అయితే సరిగ్గా ఆ సమయానికి బిగ్గరగా భక్తుల నామస్మరణ వినిపిస్తుంది. అంతేకాదు ఆ మూడు దివ్య రథాలు సరిగ్గా ఆ ప్రధాన వీధిలోనే ఆయన ఇంటి ముందు ఆగిపోతాయి.