అంగన్ వాడీలో 15 మంది చిన్నారులు.. ఒక్కసారిగా పైకప్పు కూలడంతో.. వీడియో
కొన్ని ప్రభుత్వ బడుల్లో పరిస్థితులు ఎంతదారుణంగా ఉన్నాయో చెప్పేందుకు ఇప్పుడు చెప్పబోయే ఘటనే ఓ బెస్ట్ ఎగ్జాంపుల్..! అయితే.. అదృష్టవశాత్తూ పిల్లలకు ప్రాణాపాయం తప్పింది. అంగన్‌వాడీ స్కూల్‌లో పైకప్పు ఊడిపడిన ఘటనలో కొందరు పిల్లలు గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా వెంకటపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో జరిగింది ఈ ఘటన. వెంటనే వాళ్లందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నారాయణఖేడ్ మండలం వెంకటాపుర్ గ్రామంలో అంగన్‌వాడి స్కూల్లో చిన్నారులు అక్షరాలు దిద్దుకుంటున్నారు.
ఇంతలో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వినిపించింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఐదుగురు చిన్నారులకు గాయాలు కావడంతో వారి ఆర్తనాదాలతో స్కూలు ప్రాంగణం మార్మోగింది. దాంతో చుట్టుపక్కలవారు అక్కడికి పరుగెత్తుకొచ్చారు. అంగన్‌వాడి స్కూలు పై కప్పు పెచ్చులూడి చిన్నారులపై పడటంతో భయంతో చిన్నారులు ఏడవడం మొదలుపెట్టారు. అలర్టయిన అంగన్‌వాడి సిబ్బంది, స్థానికులు చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మౌనిక, హారిక, రిషిక, అంకిత, అవినాష్ అనే విద్యార్థులు గాయపడ్డారు.