Viral: సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..

|

Dec 31, 2024 | 7:23 PM

ఒకవైపు తుఫాను వచ్చిన ప్రతిసారీ పదుల సంఖ్యలో ఇళ్ళు సముద్ర గర్భంలో కలిసిపోతుంటే మరోవైపు ప్రతి సంవత్సరం లాగే ఆనవాయితీగా సముద్ర తీరంలో బంగారం కోసం వేట సాగిస్తుంటారు ఇక్కడ మత్స్యకారులు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరప్రాంతంలో తుఫాన్లు, అల్పపీడనాలు ఏర్పడిన సందర్భాల్లో సముద్రం ఉప్పాంగి, అల్లకల్లోంగా మారినప్పుడల్లా తీరప్రాంతాలకు చెందిన మత్స్యకారుల పిల్లలు, పెద్దలు బంగారు రజను కోసం వెదుకులాట ప్రారంభిస్తారు.

మత్స్యకారులు ఒక్కొక్కరు ఒక్కొక దువ్వెన పట్టుకొని, కెరటాలు ఒడ్డుకు వచ్చి లోపలకు వెళ్ళిన సమయంలో ఇసుకపై దువ్వెనతో గీస్తారు. ఇలా గీకడం ద్వారా ఇసుక లోపల నుంచి మిణుకు మిణుకు మంటూ చిన్నచిన్న బంగారు రజను మత్స్యకారుల కంట పడుతుంది. దీంతో మళ్ళీ సముద్రంలో కెరటం ఒడ్డుకు వచ్చేలోపు ఆ ఇసుకను ప్లాస్టిక్ ట్రేలోకి తీస్తారు. ఇలా ఒడ్డును ఉన్న ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత బంగారు రజనను దక్కించుకుంటూ ఉంటారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకు ఒక్కక్కరూ కనీసం 500రూపాయిల నుంచి 800 రూపాయల విలువైన బంగారు రజను సేకరిస్తామని మత్స్యకారులు చెబుతున్నారు. పూర్వకాలం ఇక్కడో మహానగరం ఉండేదని అప్పట్లో సముద్రం ఉప్పొంగి నగరం సముద్రగర్భంలో కలిసిపోయిందని, సముద్రం అల్లకల్లోలంగా మారినప్పుడల్లా ఇసుకలో ఉన్న బంగార ముక్కలు, ఇసుక రాపిడికి రజనుగా మారి ఒడ్డుకు చేరుతుందనే కథను మరికొందరు మత్స్యకారులు చెప్తుంటారు. ఏది ఏమైనా కాకినాడ, కొత్తపల్లి ఉప్పాడ తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున గుమిగూడి బంగారం ముక్కల కోసం మత్స్యకారులు జల్లెడ పడుతున్నారు.

ఉప్పాడ సముద్ర తీరంలో తుపాన్ల సమయంలో స్థానిక మత్స్యకారులు, గ్రామస్థుల్లో చాలా మంది ఇలా ఇసుకలో శ్రద్ధగా వెతుకుతూ కనిపిస్తుంటారు. వీరు బంగారం కోసం రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రూపులుగా తీరంలో దువ్వెనలతో ఇసుకపై గీస్తూ ఉంటారు. అకస్మాత్తుగా ఇసుక రేణువుల మధ్య ఏదైనా మెరిస్తే… వెంటనే దానిని నిశితంగా పరిశీలించి బంగారమని నిర్ధరణకు వస్తే, దానిని అలాగే చేతి వేళ్లతో గట్టిగా పట్టుకుని, మళ్లీ అక్కడే మరింత హుషారుగా దువ్వెనతో గీస్తుంటారు. పూర్వ కాలం నుంచి ఇక్కడ బంగారం దొరుకుతోంది. కొన్ని సార్లు బంగారు ఆభరణాలు దొరుకుతాయి. కానీ బంగారు రజను మాత్రం తుపాను సమయాల్లోనే దొరుకుతుంది. అందుకే ఇప్పుడు మేం ఇసుకను గీయడానికి సులభంగా ఉండే దువ్వెనలను ఉపయోగించి ఇసుకలో గాలిస్తుంటాం. మా ముత్తాతలు, వాళ్ల తాతల కాలం నుంచి కూడా బంగారం వేట సాగుతోంది. చేపల వేట లేని సమయాల్లో మా కుటుంబాలకు ఇది కూడా ఒక ఆదాయ మార్గమే” అని అప్పటికే దొరికిన బంగారం రేణువులను చేతిలో గట్టిగా పట్టుకుని చెబుతారు స్థానిక మత్స్యకారులు. తుపాన్ల సమయంలో సముద్రంలోకి దిగవద్దని, తీరంలో ఉండడం ప్రమాదకరమని గ్రామ పెద్దలు, పోలీసులు, ఇతర అధికారులు హెచ్చరిస్తుంటారు. అయితే, ఈ గ్రామస్థులు అప్పుడు ఎవరి మాటా వినరు. అల్పపీడనం మొదలు తుపాను వచ్చే సూచనలు కనిపించగానే, అంటే తీరంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటే చాలు దువ్వెనలు పట్టుకుని తీరంలో బంగారం వేట సాగిస్తుంటారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.