ఖాతాదారుల బంగారాన్ని స్వాహా చేసిన బ్యాంక్ మేనేజర్,క్యాషియర్
ప్రజలు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముకు భద్రతలేకుండా పోతోంది. బంగారం, డబ్బు ఇంట్లో ఉంటే దొంగలు ఎత్తుకెళ్తారని బ్యాంకుల్లో దాచుకుంటారు. కొందరు కుటుంబ అవసరాలకోసం బంగారాన్ని బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెడుతుంటారు. అలా ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని దొంగిలించి క్రికెట్ బెట్టింగులకు పాల్పడ్డారు ఓ బ్యాంక్ మేనేజర్ అండ్ క్యాషియర్.
కంచే చేను మేసిన చందంగా మారిన ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండంలో జరిగింది. చెన్నూరులోని భారతీయ స్టేట్ బ్యాంక్ బ్రాంచిలో ఈ కుంభకోణం జరిగింది. ఈ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేసే నరిగె రవీందర్ బెట్టింగులకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో రూ.40 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ నష్టాన్ని పూడ్చుకోడానికి అడ్డదారి తొక్కాడు. బ్యాంకు మేనేజర్ ఎన్నపురెడ్డి మనోహర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్‌తో కలిసి ఖాతాదారుల బంగారాన్ని కొట్టేయడానికి పథకం రచించాడు. గతేడాది అక్టోబర్ నుంచి వీరు తమ ప్రణాళికను అమలు చేశారు. బ్యాంకులోని 402 మంది ఖాతాదారుల గోల్డ్ లోన్ ప్యాకెట్ల నుంచి కొద్దికొద్దిగా 25.17 కిలోల బంగారాన్ని బయటకు తీశారు. ఈ బంగారాన్ని కొన్ని ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థల్లో పనిచేస్తున్న ధీరజ్, రాజశేఖర్, కిషన్‌లకు అప్పగించారు. వారు ఆ బంగారాన్ని తమ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. వచ్చిన డబ్బులోంచి కమీషన్ ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని రవీందర్ ఖాతాకు బదిలీ చేసేవారు. ఈ డబ్బును రవీందర్ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కోసం ఉపయోగించినట్లు, ఈ సొమ్మంతా విదేశాలకు మళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇటీవల బ్యాంకు ఆడిటింగ్ తనిఖీల్లో ఈ భారీ గోల్డ్ లోన్ స్కామ్ బట్టబయలైంది. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించిన అధికారులు, వెంటనే బ్యాంకు రీజినల్ మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన చెన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు క్యాషియర్ రవీందర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా మీడియాకు వెల్లడించారు. బ్యాంకు మేనేజర్, క్యాషియర్‌తో పాటు ప్రైవేట్ ఫైనాన్స్ ఉద్యోగులు, బినామీలతో కలిపి మొత్తం 47 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి ఇప్పటివరకు 15.23 కిలోల బంగారం, రూ. 1.61 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని ఆయన వివరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బయటి నుంచి వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకున్న వ్యక్తి.. కాసేపటికే నురగలు కక్కుతూ
Earthquake: భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి
ల్యాబ్‌లో తయారైన మానవ కిడ్నీ..ఆశ్చర్యంగా పని చేస్తోంది
త్వరలో ఆధార్ యాప్ ఇక.. ఆధార్ సెంటర్లకు బై బై
టెర్రస్ పై నుంచి దూకబోయిన ‘నీట్’ విద్యార్థిని.. చివరి నిమిషంలో