ఓర్నీ.. ఇది ఆటోనా.. విమానమా.. బిజినెస్ క్లాస్‌ను మించి..వీడియో
చాలామంది తాము చేసే వృత్తిలోనే ఆనందాన్ని వెతుక్కుంటారు. అంతేకాదు కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. ఇటీవల సిమెంట్ పనిచేసే ఓ వ్యక్తి తన నైపుణ్యంతో అద్భుతమైన మంచాన్ని తయారు చేసి అందరినీ ఆకర్షించాడు. తాజాగా మరో వ్యక్తి తన ఆటోను ఏకంగా విమానాన్ని తలపించేలా తీర్చిదిద్దాడు. తన ఆటో ఎక్కే ప్యాసింజర్ల ప్రయాణాన్ని సుఖమయంగా మార్చాలనుకున్న సదరు డ్రైవర్.. తన ఆటోలో ఫ్లైట్ లో ఉండే సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
ఆ ఆటో ఎక్కిన ప్రయాణికులంతా అందులోని సదుపాయాలు చూసి అవాక్కవుతున్నారు. ఆటోలో ఉచిత వైఫై మాత్రమే కాదు, టీవీ, వివిధ రకాల ట్యాబ్‌లు, మ్యాగజైన్లు, రాసుకోడానికి ప్యాడ్, పేపర్స్ అందుబాటులో ఉంచాడు. ప్రయాణికులు వారి అభిరుచులకు తగ్గట్టు పనులు చేసుకునేలా సకల సదుపాయాలు ఏర్పాటు చేశాడు. ఇక ఏసీ ఉండనే ఉంటుంది. దీంతో ప్యాసింజర్ల ప్రయాణం ఆహ్లాదకరంగా మారడంతో పాటు సమయం వృథా కాకుండా ఆటోలో ప్రయాణిస్తూ తమ పనులను చేసుకోవచ్చు. ఈ ఆటోకు సంబంధించిన వీడియోను ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించేంత డబ్బు లేకపోయినా.. ఈ ఆటోలో కచ్చితంగా ఆ అనుభూతి పొందవచ్చని క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఇప్పటివరకూ దాదాపు 2 లక్షల మంది లైక్ చేశారు. ఇది ఆటోకాదు.. ఎమిరేట్స్ విమానం అంటూ కామెంట్లు చేస్తున్నారు.