చిట్టీలు కడుతున్నారా? ఇలాంటివారు ఉంటారు.. తస్మాత్ జాగ్రత్త
మధ్యతరగతి ప్రజలు భవిష్యత్ అవసరాల కోసం పైసా పైసా కూడబెట్టుకుంటారు. తినక, తాగక నోళ్లు కట్టి మరీ పొదుపు చేస్తూ ఉంటారు. బ్యాంకుల్లో సేవింగ్స్ రూపంలోనో, తెలిసిన వారి దగ్గర చీటీల రూపంలోనో డబ్బులు దాస్తుంటారు. ఈ క్రమంలో అప్రమత్తంగా లేకుంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. గతంలో అనేక బ్యాంకులు, చిట్టీల మోసాలు వెలుగు చూసిన సంఘటనలు ఉన్నాయి.
తాజాగా అలాంటి ఘటనే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. చిట్టీల పేరుతో ఘరానా మోసం వెలుగుచూసింది. రూ.40 కోట్లతో చిట్టీల వ్యాపారి రాత్రికి రాత్రే బిచానా ఎత్తేశాడు. ఐ.పోలవరం మండలం మురమళ్ల గ్రామానికి చింతలపూడి వీర శంకరరావు… సుమారు 30 సంవత్సరాల క్రితం చిన్న చిన్న చిట్టీలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించాడు. క్రమంగా వ్యాపారస్తులు, ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని ఐదు లక్షల నుంచి కోటి రూపాయల చిట్టీలను నడపడం మొదలుపెట్టాడు. చాలా మంది వీర శంకరరావును నమ్మి చిట్టీలు వేశారు. అయితే, చిట్టీ కాలపరిమితి పూర్తయిన వారికి కూడా సొమ్మును తిరిగి చెల్లించకుండా అందరినీ మోసం చేశాడు. గత నెల 28వ తేదీన తన భార్య, పిల్లలతో సహా పరారయ్యాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, పోలీసులను ఆశ్రయించారు. బాధితుల్లో ఎక్కువ మంది రోజువారి కూలీలు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, చిరు వ్యాపారులే ఉన్నారు. రోజు వారీ కూలీ పని చేసి రూపాయి రూపాయి పోగు చేసుకుని చిట్టీలు కట్టామని, ఇప్పుడు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా పారిపోయారన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అభిమాని చేసిన పనికి నివ్వెరపోయిన సంజయ్ దత్
కారు, బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే కాస్త ఆగండి..
Elephants: ఇకపై ఏనుగుల జాడ ముందే తెలిసిపోతుంది
