Viral Video: శివునికి అభిషేకం చేస్తూనే శివైక్యం…!

వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరికీ తెలియదంటారు. మనిషి జన్మించినప్పుడే మృత్యువు కూడా వెంటే వస్తుందని పెద్దలు చెబుతారు. అది ప్రతిక్షణం నీడలా వెన్నంటే ఉంటుందని, సమయం రాగానే క్షణాల్లో ప్రాణాన్ని తనతో తీసుకెళ్లిపోతుందని పెద్దలు చెప్పగా వింటుంటాం. అది అక్షర సత్యమని అనిపిస్తుంది ఈ ఘటన చూస్తే.

Updated on: Nov 21, 2024 | 1:36 PM

గుజరాత్‌లోని ఓ శివాలయంలో భక్తులు స్వయంగా అభిషేకం చేసుకుంటున్నారు. భక్తులు ఒకరి తర్వాత ఒకరు శివలింగానికి జలంతో అభిషేకం చేస్తున్నారు. కొందరు గంట మోగిస్తున్నారు. మరికొందరు స్వామివారి అభిషేకం చూస్తూ నిల్చున్నారు. ఇంతలో ఈక్రమంలోనే ముగ్గురు భక్తులు శివలింగం చుట్టూ కూర్చుని స్వామివారికి ఒకరి తర్వాత ఒకరు అభిషేకం చేశారు. అనంతరం భక్తితో నమస్కరిస్తున్నారు. అంతే ఆ ముగ్గురిలో ఓ వ్యక్తి ఒక్కసారిగా శివలింగం ముందే కుప్పకూలిపోయాడు.

ఈ హఠాత్‌ పరిణామానికి అక్కడున్న వారు కంగారు పడ్డారు. పక్కనే ఉన్న ఓ వ్యక్తి వెంటనే అలర్టయి అతనికి గుండెపోటు వచ్చిందని గ్రహించి సీపీఆర్‌ చేశాడు. అయినా అతని ప్రయత్నం ఫలించలేదు. అతను అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఊహించని ఈ ఘటనతో అక్కడున్నవారంతా మ్రాన్పడిపోయారు. అప్పటి వరకూ స్వామివారికి ఎంతో భక్తితో పూజించిన అతను క్షణాల్లో విగతజీవిగా మారడం వారిని కలచివేసింది. మరోవైపు భగవంతుని సన్నిధిలో శివైక్యం చెందడం ఎంతటి అదృష్టం అని మరికొందరు చర్చించుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us