Pulasa Fish: దొరక్క.. దొరక్క చిక్కిన పులస.. 2 కేజీల చేప ఎంత పలికిందో తెల్సా..?
పులస...ఈ పేరు వింటేనే నాన్‌వెజ్ ప్రియులకు నోరూరిపోతుంది. గోదావరి జిల్లాల్లో అయితే పులస క్రేజే వేరు. ఆ మాటకొస్తే ఫిష్ మార్కెట్‌లో పులస ప్రయారిటీనే సెపరేటు. పులసది తిరుగులేని బ్రాండ్. పుస్తెలమ్మినాసరే పులస తినాలంటారు గోదారోళ్లు. అనడమే కాదు, ఎంత రేటైనా పెట్టి కొని తింటారు. వేలంలో పోటీపడిమరీ వేలకు వేల రూపాయలు ఖర్చు చేస్తారు. దాంతో, పులస ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటుంది.
అవును… పులస తినకపోతే ఆ పుట్టుకే వ్యర్థం అనేది గోదారోళ్లు చెప్పే మాట. కానీ… ఇప్పుడు పుస్తెలమ్మినా పులస తినే పరిస్థితుల్లేవు. ఆ లెవల్లో ఉంది పులసకున్న ఎమ్మార్పీ. లేటెస్ట్‌గా యానాం వశిష్ట గోదావరిలో మత్స్యకారుల వలకు 2 కిలోల పులస చేప చిక్కింది. యానం పుష్కరఘాట్ వద్ద ఓ మత్స్యకారుడి వలకు చిక్కిన పులస అతడి పంట పండించింది. రెండు కిలోల బరువున్న ఈ చేపకు వేలం వేయగా నాగలక్ష్మి అనే మహిళ 19 వేల రూపాయలకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత రావులపాలేనికి చెందిన ప్రముఖ నాయకుడి కోసం ఓ వ్యక్తి ఆమె నుంచి 26 వేల రూపాయలకు ఆ చేపను కొనుగోలు చేశాడు. ఈ సీజన్‌లో పులసకు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. గోదావరికి ఎదురీదే పులస అత్యంత రుచికరంగా ఉంటుందని చెబుతారు. ఇటీవల కాలంలో పులస చేపలు చాలా అరుదుగా దొరకడంతో దీని ధర ఆకాశాన్ని అంటుతుంది. పులస ఇంత ధర పలకడానికి పులస రుచి ముందు మిగతా చేపల రుచి దిగదుడుపే కారణమట.