బోటు కడిగేందుకు నదిలో దిగిన మహిళ.. నీటిలో కనిపించింది చూసి షాక్
ఒక్కోసారి సరదాగా చేసే పనులు.. ఊహించని అనుభవాలుగా మిగిలిపోతాయి. బాల్యంలో చదువుకునే పుస్తకంలో దాచిన చీటీ, బాల్యంలో ముద్దుగా చూసుకున్న ఆటబొమ్మ, అల్మరాలో దొరికిన పాత లెటర్, పోట్లాడి మరీ కొనిపించుకున్న పెన్ను.. ఇలాంటివి ఏళ్ల తర్వాత కనిపిస్తే.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. అలాంటిదే ఒక అనుభవం మిచిగన్ రాష్ట్రానికి చెందిన స్కూబా డైవర్ జెన్నిఫర్ డౌకర్‌కు ఎదురైంది.
తన గ్లాస్ బాటమ్ బోటును శుభ్రం చేసే క్రమంలో.. షిబాయగన్ నదిలో డైవ్ చేసిన జెన్నిఫర్‌కి.. నది అడుగున ఒక ఆకుపచ్చ రంగు సీసా కనిపించింది. మొదట అదెవరో తాగి పారేసిన మద్యం బాటిల్ అనుకుంది. కానీ, చేతిలోకి తీసుకొని చూడగా.. మూత బిగించిన ఆ సీసాలో ఓ లెటర్ కనిపించింది. జాగ్రత్తగా బయటికి తీసి చదివితే.. అది 1926 నవంబర్‌లో రాసిన లేఖ అని అర్థమైంది. ఆ లేఖలో “ఈ బాటిల్ ఎవరికైనా దొరికితే, దాన్ని చెబోయగన్‌లోని జార్జ్ మోరోకు తిరిగి ఇవ్వండి. ఎక్కడ దొరికిందో కూడా చెప్పండి” అని రాసి ఉంది. ఈ ఆశ్చర్యకర ఘటనతో థ్రిల్ ఫీల్ అయిన జెన్నిఫర్, ఫేస్‌బుక్‌లో ఫోటోలు షేర్ చేసింది. ఒక్కరోజులోనే ఆ పోస్ట్ వైరల్ అయి, లక్షలాది షేర్లు, కామెంట్లు వచ్చాయి. ఆ లేఖ ఎవరు రాసారో వెతకడం మొదలైంది. అంతలోనే జెన్నిఫర్‌కి ఒక కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది మిచెల్ ప్రిమో. లేఖ రాసిన జార్జ్ మోరో కూతురు. ఆ లేఖలోని హ్యాండ్‌రైటింగ్ తన తండ్రిదని మిచెల్ వెంటనే గుర్తుపట్టింది. ఆ లేఖ.. తాను పుట్టకముందే రాసిందైనా.. ఆమె దానిని గుర్తించగలిగింది. వెంటనే.. జెన్నిఫర్ ఆ బాటిల్‌ను, అందులోని లెటర్‌ను మిచెల్‌కు ఇవ్వాలని అనుకున్నా.. మిచెల్ మాత్రం వాటిని జెన్నిఫర్ వద్దే ఉంచుకోవాలని చెప్పింది. ఆ వస్తువులను అందరూ చూసేలా.. బోటులో ప్రదర్శనగా పెట్టమని కోరింది. దాంతో జెన్నిఫర్ ఆ బాటిల్, లేఖను ఫ్రేమ్ చేసి తన ఆఫీస్‌లో అమర్చింది. ఏదో బోటు కడుక్కుందామని నదికి పోయిన జెన్నిఫర్‌కు కనిపించిన వందేళ్ల నాటి సీసా.. ఎక్కడో ఉన్న వ్యక్తులను పరిచయం చేయటంతో.. జెన్నిఫర్‌కు ఇదంతా ఇప్పుడు కలలా అనిపిస్తోంది. ఒక సాధారణ సందేశం కూడా ఒక్కోసారి పెద్ద కథగా మారుతుందని ఈ అనుభవం చెబుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: