వెంకన్నకు విరాళాల వెల్లువ..11 నెలల్లో రూ.918 కోట్లు
తిరుమల శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. అందుకే ఆయనకు వెల కట్టలేని ఆభరణాలు ఉన్నా.. భక్తులు తమ భక్తి కొలదీ రకరకాల ఆభరణాలను స్వామివారికి కానుకగా సమర్పిస్తుంటారు. అలా శ్రీనివాసునికి గత 11 నెలల్లో విరాళాలు వెల్లువెత్తాయి. సామాన్యుడి నుంచి సంపన్నుడు దాకా దేశ విదేశాల్లోని భక్తులు సమర్పించే కానుకలు దాతలు ఇచ్చే విరాళాలు తిరుమలేశుడి ఆదాయాన్ని గణనీయంగా పెంచుతున్నాయి.
ఆపదమొక్కుల స్వామికి ఆఫ్ లైన్, ఆన్ లైన్ లో అందుతున్న కానుకలు విరాళాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడంతో టీటీడీ ఖజానా నిండుతోంది. ఇప్పటికే రూ. వేల కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండగా, టన్నుల కొద్దీ బంగారు డిపాజిట్లు పలు జాతీయ బ్యాంకుల్లో టీటీడీ పేర ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ ట్రస్ట్ లకు విరాళాల వెల్లువ కొనసాగుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏర్పడ్డ టీటీడీ పాలకమండలి పాలన 11 నెలలు పూర్తికాగా ఇప్పటిదాకా రికార్డు స్థాయిలోనే విరాళాలు టీటీడీకి చేరాయి. టీటీడీ లెక్కల ప్రకారం గత 11 నెలల్లో రూ 918.6 కోట్లు విరాళాలు అందాయి. 2024 నవంబర్ 1 నుండి 2025 అక్టోబర్ 16వ తేదీ వరకు టీటీడీ ట్రస్ట్ లకు వెల్లువలా విరాళాలు చేరాయి. శ్రీవారికి భక్తులు, దాతలు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో అందించిన విరాళాల్లో అత్యధికంగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ 338.8 కోట్లు విరాళంగా రాగా, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీకి రూ 252.83 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్ కు రూ 97.97 కోట్లు రాగా, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ 66.53 కోట్లు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కు రూ 56.77 కోట్లు వచ్చినట్టు టీటీడీ తెలిపింది. ఇక ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ కు రూ 33.47 కోట్లు, బర్డ్ ట్రస్ట్ కు రూ 30.02 కోట్లు రాగా ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ కు రూ 20.46 కోట్ల విరాళాలు వచ్చాయి. ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్ట్ కు రూ 13.87 కోట్లు, ఎస్వీబిసీ కు రూ 6.29 కోట్లు, స్విమ్స్ కు రూ 1.52 కోట్లు దాతలు నుంచి విరాళాలుగా వచ్చినట్లు టిటిడి వివరించింది. ఆన్ లైన్ ద్వారా రూ 579.38 కోట్లు, ఆఫ్ లైన్ ద్వారా 339.20 కోట్లు విరాళాలు అందినట్లు టిటిడి లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. తిరుమల శ్రీవారికి కానుకలు విరాళాలు సమర్పించిన భక్తులు దాతలకు తగిన గౌరవం, సదుపాయాలను టిటిడి కల్పిస్తోంది. దాతలకు అందే సేవల పట్ల ఎక్కడా నిర్లక్ష్యానికి అవకాశం లేకుండా చూడాలన్న చైర్మన్ అదేశాలతో ట్రస్ట్ లకు విరాళాలు పెద్ద ఎత్తున అందుతున్నాయి. మరోవైపు పలు నిర్మాణాలు, యంత్రాలు కొనుగోలు, సాంకేతిక అభివృద్ధికి సంపూర్ణ సహకారం కూడా దాతాల నుంచి టీటీడీకి లభిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తున్న 30 ప్లస్ బ్యూటీస్
Prabhas: చిన్నప్పటి నుంచి మనోడికో చెడ్డ అలవాటు ఉంది | ప్రభాస్‌తో ఎవ్వరూ చేయని సాహసం
ఓ సినిమా వాళ్లు కాసింతైనా మానవత్వంతో స్పందించండబ్బా
విక్రమ్ కొడుకు ఈ సారైన ఆకట్టుకుంటాడా? హిట్టా..? ఫట్టా..?
బిగ్ బాస్ షోపై సీరియల్ నటి సంచలన కామెంట్స్
