AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Update: పగలు మండే ఎండలు.. సాయంత్రానికి చిరుజల్లులు

Weather Update: పగలు మండే ఎండలు.. సాయంత్రానికి చిరుజల్లులు

Phani CH
|

Updated on: May 09, 2026 | 12:13 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనుహ్యంగా మారుతోంది. ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు, మరోవైపు అధిక ఉష్ణోగ్రతలతో వడగాల్పులు ప్రజలను, రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాబోయే రెండు రోజులు ఈ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. పిడుగులు, వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం రోజుకోరకంగా మారుతోంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలోని ఉపరితల ఆవర్తనం, ఒడిశా నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా ద్రోణి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో శుక్ర, శనివారాల్లో పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దక్షిణ భారతదేశంపై కొనసాగుతున్న పలు వాతావరణ మార్పుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు.ఈ ప్రభావాలకు తోడు తెలుగు రాష్ట్రాలపై నైరుతి, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తుండటంతో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా అధికారులు వేస్తున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం.. గురువారం గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు కొనసాగిన ఉత్తర దక్షిణ ద్రోణి శుక్రవారానికి బలహీనపడింది. దీంతో శుక్రవారం, శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో జిల్లాలలో ఉరుములు మెరుపులు, 30 నుండి 40 కి.మీ వేగం కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గురువారం భద్రాచలంలో అత్యధికంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా, ఖమ్మంలో 40 డిగ్రీల మార్కును తాకింది. ఆదిలాబాద్‌లో 39.8 డిగ్రీలు, నల్గొండలో 39.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో కూడా 39 డిగ్రీలకు పైగా ఎండ ప్రభావం కనిపించగా, మహబూబ్‌నగర్ 38.9, హనుమకొండలో 38.5 డిగ్రీలుగా రికార్డయ్యాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఎండ తీవ్రత కొంత తక్కువగా ఉండి 36.8 డిగ్రీల వద్ద నిలకడగా కొనసాగింది. రామగుండం ప్రాంతంలో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి ఖమ్మం మినహా మిగిలిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 లోపే ఉన్నప్పటికీ, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మధ్యాహ్నం సమయంలో ప్రయాణాలు చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా వడదెబ్బ తగలకుండా తగినంత నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏపీలో వాతావరణం విభిన్న రీతుల్లో కొనసాగుతోంది. ఒకవైపు వర్షాలు ప్రజలకు ఉపశమనం కలిగిస్తుండగా, మరోవైపు తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఈ భిన్నమైన పరిస్థితులు రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ట్రోపో ఆవరణంలోని గాలుల ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఏపీలో గురువారం పోలవరం జిల్లా వీఆర్ పురంలో అత్యధికంగా 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంపరైలో 21.5మిమీ వర్షపాతం నమోదైంది. పలు చోట్ల భారీ వర్షానికి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం రాశులు నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే, వారం రోజులుగా ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షాలు కాస్త ఊరటనిచ్చాయి. వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు. ఉత్తర కోస్తాలో శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, గోదావరి జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్ సహా రాయలసీమలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు, అల్లూరి జిల్లాలోని జీకే వీధి మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. అలాగే ముంచింగిపుట్టు, పెదబయలు, గోకవరం, చింతూరు, కూనవరం వంటి ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రతతో కూడిన వడగాలులు వీచే ప్రమాదం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలలో శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. రాయలసీమలో శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30 -40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వర్షం కురిసే సమయంలో పిడుగుల పట్ల, ఎండ వేళ వడదెబ్బ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గాలిలో తేమ, ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల వాతావరణం ఇలా అనిశ్చితంగా మారింది. పొలాల్లో పనిచేసే రైతులు, ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. అకాల వర్షాలు, వడగాలుల కలయికతో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో ఇన్వెస్ట్ 93S అనే కోడ్ నేమ్‌తో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది మే 9 నుంచి తెలుగు రాష్ట్రాల వైపు భారీ మేఘాలను నెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ ప్రాంతాల్లో హాగుపిట్ అనే తుపాను తీవ్రంగా తిరుగుతోంది. దీని ప్రభావం నేరుగా భారత్‌పై లేకపోయినా, వర్షాకాలం (నైరుతీ రుతుపవనాలు) త్వరగా వచ్చేందుకు ఇది దోహదపడుతోంది. భూమధ్య రేఖ వద్ద ఉన్న భారీ మేఘాలు మే 9 నుంచి దక్షిణ భారత్ పైకి కదిలి రానున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా

ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు

లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్

రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి..

ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు

Follow Us