వినాయక చవితి వస్తున్నా వాన లేదు. మబ్బులే తప్ప చినుకు కరువు.. వర్షాలు లేక రైతుల్లో ఆందోళన
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం విచిత్రంగా మారింది. సెప్టెంబరు రెండో వారంలోనూ ఏపీలో ఎండలు, ఉక్కపోత కొనసాగుతుండగా పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో సెప్టెంబరు 13 నుంచి 17 వరకు భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు వర్షాభావంతో పంటలు ఎండిపోవడం, తాగునీటి కొరత, విద్యుత్ కోతలు రైతులు, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
జోరున వానలు కురవాల్సిన రోజుల్లో సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. సెప్టెంబరు రెండో వారం వచ్చినా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాన జాడ కనిపించకపోవడంతో ఉక్కపోత, తీవ్రమైన ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. ఒకవైపు వానలేక పొలాలు ఎండిపోయి రైతాంగం కంటతడి పెడుతుంటే, మరోవైపు పల్లెల్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చి గుక్కెడు నీటి కోసం జనం అల్లాడిపోతున్నారు. వర్షాలు లేక పచ్చిక బయళ్ళు ఎండిపోయి, పశువులకు మేత దొరకడం గగనంగా మారింది. ఇటు..తుఫాన్లు, అల్పపీడనాలు ఏర్పడినా వానలు మాత్రం కురవడంలేదు. మరోవైపు, మండుతున్న ఎండలతో విద్యుత్ వినియోగం పీక్ కు చేరింది. అటు..ఉక్కపోత.. ఇటు విద్యుత్ కోతలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గత రెండు రోజుల్లో ఏపీలో మధ్యాహ్నం సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 473 ప్రాంతాల్లో 30 డిగ్రీల కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9గంటల నుంచే ఎండ మండిపోతోంది. సాయంత్రం వరకు వేడి వాతావరణం కొనసాగింది. దీనికితోడు ఉక్కపోత నెలకుంది. ఎండ తీవ్రత కొనసాగడానికి ఎల్‌నినో పరిస్థితులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వేసవి సుదీర్ఘంగా కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సోమవారం సాయంత్రం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మారిపోవడమే కాకుండా, విపరీతమైన ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాలు మొదలయ్యాయి. వాతావరణంలో వచ్చిన ఈ సడన్ చేంజ్‌తో అప్రమత్తమైన అధికారులు తక్షణ హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ వాతావరణ కేంద్రం ప్రకారం ప్రభావిత ప్రాంతాలకు ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్‌డివిజన్ పరిధిలో మంగళవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఆత్మకూరు, వెలుగోడు, పాములపాడు, కొత్తపల్లి మండలాల్లో ఉదయం నుంచి వానలు కొనసాగుతున్నాయి. గత ఐదు రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షంతో గొప్ప ఉపశమనం లభించింది. సమయానికి వర్షాలు లేక పొలాల్లో ఎండిపోతున్న పంటలకు ఈ వాన ప్రాణం పోసిందని స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాల రాకతో పల్లెల్లో మళ్లీ వ్యవసాయ పనులు వేగం పుంజుకున్నాయి. గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారడంతో ఓ మోస్తరు వర్షం కురిసింది. వినుకొండ, నర్సరావుపేట, బాపట్ల పరిసర ప్రాంతాల్లో కురిసిన ఈ చినుకులు ప్రజలకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం అందించాయి. దాదాపు కొన్ని రోజులుగా కరవు ఛాయలు అలముకున్న వేళ, ఈ వర్షం పడటంతో స్థానిక రైతులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎండిపోయే దశలో ఉన్న పైర్లకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. గ్రామానికి ఆనుకుని ఉన్న హంద్రీ నది ఎల్ నినో ప్రభావంతో పూర్తిగా ఎండిపోవడంతో, నదిలో ఉన్న 5 తాగునీటి బోర్లు ఇంకిపోయాయి. దీంతో గ్రామస్థులు గుక్కెడు నీళ్ల కోసం కిలోమీటరుకు పైగా దూరం వెళ్లి పొలాల వద్ద నుంచి బిందెలతో, సైకిళ్లు, బైకులు, ఎద్దుల బండ్లపై నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. గాజులదిన్నె ప్రాజెక్ట్ నుంచి వెంటనే హంద్రీ నదికి నీటిని విడుదల చేసి తమ దాహార్తిని తీర్చాలని గ్రామ ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. సూపర్ ఎల్ నినో కారణంగా ఈసారి కేసీ కెనాల్‌కు ఎగువ నుంచి బొట్టు నీరు వచ్చే అవకాశం లేదని, అందుకే వినాయక ఘాట్ వద్ద ప్రతిఏటా లాగా నిమజ్జనం చేయడం కష్టమని కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరూ పెద్ద విగ్రహాలను ప్రతిష్టించవద్దని, ఇప్పటికే కొనుగోలు చేసి ఉంటే వాటిని వచ్చే ఏడాదికి భద్రపరుచుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంట్లో, మండపాల్లో కేవలం అడుగు లేదా అడుగున్నర మట్టి విగ్రహాలను మాత్రమే పెట్టాలని, నిమజ్జనం రోజున ఇళ్ల వద్దే బకెట్లు లేదా టబ్‌లలో నిమజ్జనం చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ద్రోణి, బలహీనమైన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారనుంది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు, ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. పంటలకు కనీసం 8 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు నిరసన చేపట్టారు. సక్రమంగా కరెంటు సరఫరా కాకపోవడంతో బోర్లు ఉన్నప్పటికీ పంటలకు నీళ్లు పారించలేక పొలాలు ఎండిపోతున్నాయని రుయ్యాడి, కజ్జర్ల, అట్లీ (క) గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా “చూస్తాం.. చేస్తాం” అని దాటవేస్తున్నారని మండిపడ్డారు. మూడు గ్రామాలకు ఒకే సబ్‌స్టేషన్ ఉండటం వల్ల తీవ్ర లో-వోల్టేజీ, తరచూ ట్రిప్పింగ్ సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే మండల కేంద్రంలో భారీ ధర్నా చేస్తామని హెచ్చరించారు. కరెంట్ కోతలను నిరసిస్తూ నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ ముందు కుబీర్-భైంసా ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. ప్రభుత్వం నిరంతరం విద్యుత్ ఇస్తున్నామని ప్రకటనలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం తీవ్రమైన కోతలు అమలు చేస్తున్నారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమయానికి విద్యుత్ అందక వేసిన పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని వాపోయారు. రైతులు గంటకు పైగా రహదారిపై ధర్నా నిర్వహించడంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. విచిత్ర వాతావరణ మార్పుల వల్ల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో వరి పంటకు తీవ్ర స్థాయిలో చీడపీడలు ఆశించాయి. వర్షాకాలంలో ఎండాకాలం నాటి ఎండలు, తీవ్రమైన ఉక్కపోత, మధ్యమధ్యలో మబ్బులు వచ్చి చిరుజల్లులు కురవడం వల్ల పంటలకు మొగిపురుగు, అగ్గి తెగులు సోకినట్లు రైతులు తెలిపారు. పంటను కాపాడుకునేందుకు ఎన్ని మందులు పిచికారీ చేసినా తెగుళ్లు తగ్గడం లేదని, దీనివల్ల దిగుబడి ఘోరంగా పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అగ్రికల్చర్ అధికారులు వెంటనే స్పందించి పొలాలను పరిశీలించి తగిన సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వనపర్తి రూరల్ మండలం నాగమ్మ తాండా వాసులు కాలి బిందెలతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తండావాసి బుచ్చమ్మ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ నీళ్లు వారం రోజులకు ఒకసారి వస్తున్నాయని, అది కూడా ఒక్క బిందె నిండకముందే బంద్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాగడానికి నీరు లేక, బట్టలు ఉతుక్కోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. తమ తండాలో నీటి ఎద్దడిని శాశ్వతంగా తీర్చాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటర్ పాసైతే.. రూ.92,000 జీతం! SSC నుంచి బిగ్ నోటిఫికేషన్!!
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే ఊహించని సంఘటన
Snake in Bike: బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేసిన పోలీసుల కళ్లు జిగేల్!
మెట్రోరైల్లో యాడ్ చూసి మహిళలు ఫైర్.. ఇంతకీ ఆ యాడ్‌లో ఏముందో తెలుసా!