Telangana: తెలంగాణ ప్రభుత్వ విజన్‌లో మేము భాగమవుతాం -అక్కినేని నాగార్జున

Updated on: Dec 08, 2025 | 1:37 PM

భారత్ ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల మెగా ఈవెంట్‌ నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్‌ను మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా ప్రొజెక్ట్ చేస్తోంది. ఫ్యూచర్ సిటీని గ్లోబల్ సిటీగా ప్రపంచానికి పరిచయం చేయబోతుంది. విశ్వనగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడగలదని చూపే సంకల్పంతో ముందుకు సాగుతోంది. 2047 టార్గెట్‌గా తెలంగాణ అభివృద్ధిపై స్పెషల్ రోడ్‌మ్యాప్ సిద్ధం చేసింది. 22 ఏళ్ల తర్వాత తెలంగాణ ఎలా ఉండాలో చర్చించే వేదిక సమ్మిట్ అంటోంది రాష్ట్ర ప్రభుత్వం.

తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌లో సినీ నటుడు అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. సినీ రంగంపై సీఎం రేవంత్ విజన్‌ బాగుందని, హైదరాబాద్‌కి ప్రపంచ స్థాయి స్టూడియోలు తెచ్చేలా రేవంత్ ప్లాన్‌ చేశారని నాగార్జున అన్నారు. 50 ఏళ్లుగా హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియో నిర్వహిస్తున్నామని..  తెలంగాణ ప్రభుత్వ విజన్‌లో తాము భాగమవుతామన్నారు అక్కినేని నాగార్జున. సినీ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వ ప్రణాళిక బాగుందని చెప్పారు.

తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌ కోసం 6 ఖండాల నుంచి అతిథులు వస్తున్నారు.  44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు వారితోపాటు మరికొంత మంది VVIPలు కూడా గ్లోబల్‌ సమ్మిట్‌కి హాజరవుతున్నారు.
గవర్నర్ ప్రసంగం తర్వాత ఇవాళ మూడు సెషన్స్‌లో చర్చలు జరగబోతున్నాయి. ఇందుకోసం మెయిన్ స్టేజ్‌కి సమాంతరంగా నాలుగు హాల్స్‌ ఏర్పాటు చేశారు.