ఏసీబీ వలలో అవినీతి అనకొండ.. మర్రిగూడ ఎమ్మార్వో మహేందర్‌రెడ్డి అరెస్ట్

Edited By:

Updated on: Sep 30, 2023 | 10:14 PM

ఏసీబీ వలకు ఓ అవినీతి అనకొండ చిక్కింది. మర్రిగుడ తహసీల్దార్‌గా ఉన్న ఆ అవినీతి అధికారి.. నోట్ల కట్టలను గుట్టలు గుట్టలుగా పోగేశాడు. పక్కా సమాచారంతో దాడి చేసిన అధికారులు.. అక్కడ దొరికిన డబ్బును చూసి అవాక్కయ్యారు. అడ్డదారిన అడ్డగోలుగా సంపాదించిన ఆ ఎమ్మార్వో ఇప్పుడు కటకటాల్లోకి వెళ్లాడు. ఇక మహేందర్ రెడ్డికి ఓ బ్యాంక్‌లో లాకర్ కూడా ఉన్నట్టు గుర్తించారు. ఇవాళ బ్యాంక్ సెలవు కావడంతో కస్టడీలోకి తీసుకున్న తర్వాత లాకర్ తెరవనున్నారు ఏసీబీ అధికారులు. 

గుట్టలు గుట్టలుగా ఉన్న ఈ నోట్ల కట్టలు చూసి.. ఇదేదో బ్యాంక్ అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఇవి మర్రిగూడ ఎమ్మార్వో మహేందర్‌రెడ్డి కూడబెట్టిన అవినీతి డబ్బు. నల్గొండ జిల్లా మర్రిగూడ ఎమ్మార్వోగా పనిచేస్తున్న మహేందర్‌రెడ్డి ఇంటిపై ACB దాడి చేసింది. ఏకకాలంలో 15 చోట్ల సోదాలు నిర్వహించింది. పుట్టలో నుంచి చీమలు వచ్చినట్టుగా.. ఇంట్లో నోట్ల కట్టలు భారీ ఎత్తున బయటపడ్డాయి. ఏకంగా నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల ఆస్తులు గుర్తించారు. అందులో రెండు కోట్ల ఏడు లక్షల రూపాయలతో పాటు 259 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఓ ట్రంక్‌ పెట్టెలో దాచిన నోట్ల కట్టలను.. గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేసి బయటకు తీశారు అధికారులు. ఆ పెట్టె నిండా 500 రూపాయల నోట్ల కట్టలు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. ఆ డబ్బును లెక్కించేందుకు మిషన్ వాడాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే భారీగా బంగారాన్ని కూడా వెలికితీశారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన ఎమ్మార్వోను టీవీ9 ప్రశ్నించే ప్రయత్నం చేసింది. అయితే ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారాయన. అవినీతి ఎమ్మార్వోపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 కింద కేసు నమోదైంది. వైద్య పరీక్షల అనంతరం మహేందర్ రెడ్డిని ఏసీబీ కోర్టు ముందు హాజరుపర్చగా.. కోర్ట్ రిమాండ్ విధించింది. ఇక మహేందర్ రెడ్డికి ఓ బ్యాంక్‌లో లాకర్ కూడా ఉన్నట్టు గుర్తించారు. ఇవాళ బ్యాంక్ సెలవు కావడంతో కస్టడీలోకి తీసుకున్న తర్వాత లాకర్ తెరవనున్నారు ఏసీబీ అధికారులు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి.

Published on: Sep 30, 2023 10:13 PM