ఇకపై విమానాలకు ఇంధనంగా వంటనూనె !!
వాడేసిన వంట నూనెతో విమానాలకు ఇంధనం (SAF) ఉత్పత్తి చేయడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించడంపై ప్రపంచం దృష్టి సారించింది. సుస్థిర విమాన ఇంధనం (SAF) వినియోగాన్ని ప్రోత్సహించడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి సంస్థలు పానిపట్ రిఫైనరీలో SAF ఉత్పత్తిని ప్రారంభించాయి. ఇది వాయు రవాణా కాలుష్యాన్ని 80% వరకు తగ్గించి, 2040 నాటికి 15% SAF వాడకాన్ని లక్ష్యంగా చేసుకుంది.
వాడేసిన వంట నూనెతో విమానాలు నడుపుతారంటే మీరు నమ్ముతారా? మీరు విన్నది నిజమే. ఇన్నాళ్లూ విమానాలు నడపడానికి వేరే ఇంధనం ఉంటుందని, దాన్ని ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటారని తెలుసు. అది చాలా ఫ్యూర్‌గా ఉంటుందని, ఖరీదైనదని కూడా తెలుసు. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా వంటనూనెతో విమానాలకు ఇంధనం తయారుచేస్తున్నారు. వాడేసిన వంటనూనెతో ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ని తయారుచేస్తారు. దీనికోసం వారు వాడేసిన వంట నూనెల్ని సేకరిస్తున్నారు.రవాణా వ్యవస్థలను పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు ప్రపంచవ్యాప్తంగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ఇంజిన్ల ద్వారా వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించడానికి.. పలు దేశాలు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ప్రస్తుతకాలంలో విమాన ప్రయాణాలు జోరందుకుంటున్న క్రమంలో, సంప్రదాయ విమాన ఇంధనానికి బదులుగా సుస్థిర విమాన ఇంధనం వినియోగించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో ఆ ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు దేశీయ చమురు కంపెనీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే పలు దేశాల్లో 100% హరిత ఇంధనంతో భారీ విమానాలు నడుస్తున్నాయి. పెద్ద పెద్ద హోటళ్లలో ఒకసారి వినియోగించిన నూనెను మళ్లీ వినియోగించరు. దానిని పడేస్తారు. ఇలా పారవేసే వంటనూనె నుంచీ SAF ఉత్పత్తి చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చివరి నుంచి వార్షికంగా 35,000 టన్నుల SAFను హరియాణలోని పానిపట్ రిఫైనరీ నుంచి ఉత్పత్తి చేస్తామని ICO ప్రకటించింది. అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం 2027 నుంచి 1% SAF కలపాలన్న నిబంధన అమలుకు ఈ ఉత్పత్తి సరిపోతుందని కంపెనీ చెబుతోంది. హోటళ్లు, రెస్టారెంట్‌లు, స్వీట్స్ తయారీ సంస్థల్లో వినియోగించిన వంటనూనెను ఏజెన్సీలు సేకరించి, ఐఓసీ పానిపట్ రిఫైనరీకి సరఫరా చేస్తాయి. ఈ నూనెను వినియోగించి, SAF ఉత్పత్తి చేస్తారు. దీంతో వాయు రవాణా నుంచి వెలువడే ఉద్గారాలు అదుపులోకి వస్తాయి. లభ్యతకు అనుగుణంగా ఏటీఎఫ్‌లో దీన్ని 50% వరకు కలపొచ్చు. 2030 నాటికల్లా దేశీయ మార్గాల్లో నడిచే విమానాల్లో 5%, 2040 కల్లా 15% SAF కలపడాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విమాన ఇంధనంలో SAF కలపడం వల్ల గ్రీన్‌హౌస్ గ్యాస్ ఉద్గారాలను 80% వరకు తగ్గించొచ్చని చెబుతున్నారు. వినియోగించిన వంట నూనె, చెరకు, ధాన్యాలు, మొక్కజొన్న, వ్యవసాయ వ్యర్థాల నుంచి ఎస్‌ఏఎఫ్ రూపొందించొచ్చు. ఇవన్నీ మనదేశంలో సమృద్ధిగా లభిస్తున్నందున, ఎస్‌ఏఎఫ్ ఉత్పత్తిలో మనదేశం అంతర్జాతీయ హబ్‌గా ఎదిగే వీలుందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వేల కోట్ల వ్యాపారాలకు వారసుడు.. అయినా రాత్రిళ్లు క్యాబ్ నడుపుతూ
రెండు చేతులూ లేకపోయినా బైక్‌పై దూసుకెళ్లిన..
రైలు కదిలిపోతోంది.. నా పైసలు ఇచ్చెయ్ అన్నా.. ప్లీజ్
వేగంగా దూసుకెళ్తున్న కారు.. సైడ్ మిర్రర్ నుంచి సైలెంట్‌గా వచ్చిన పాము.. కట్ చేస్తే
