మీ సెల్‌ఫోన్ పోయిందా ?? ఇలా చేయండి.! రికవరీ చాలా ఈజీ

Updated on: Dec 29, 2025 | 12:40 PM

ప్రకాశం జిల్లా పోలీసులు ఆధునిక టెక్నాలజీతో పోగొట్టుకున్న, దొంగిలించబడిన సెల్‌ఫోన్లను రికవరీ చేస్తున్నారు. గత ఐదేళ్లలో 6,776కు పైగా మొబైళ్లను స్వాధీనం చేసుకుని యజమానులకు అందించారు. CEIR పోర్టల్ వినియోగం, సిమ్ బ్లాక్ చేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటి భద్రతా చర్యలను పాటించాలని ప్రజలకు సూచించారు. అనుమానాస్పద సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనుగోలు చేయవద్దని కూడా హెచ్చరించారు.

మీ సెల్‌ ఫోన్‌ ఎక్కడైనా పోగొట్టుకున్నారా.. లేదా చోరీకి గురైందా.. అయితే ఓ పని చేస్తే.. మీ సెల్‌ఫోన్‌ ఎక్కడుందో కనిపెట్టి తీసుకొచ్చి మీ చేతిలో పెడతామంటున్నారు ప్రకాశంజిల్లా పోలీసులు. ఆధునిక సాంకేతిక పరిజ్ఙానంతో పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను వాటి యజమానులకు అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. గత ఐదేళ్ళ కాలంలో 9 కోట్ల 50 లక్షల విలువైన సెల్‌ఫోన్లను వాటి యజమానులకు అందించామని ప్రకాశం జిల్లా ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు తెలిపారు. తాజాగా రికవరీ చేసిన 50 లక్షల విలువైన 342 సెల్‌ఫోన్లను బాధితులకు అందించారు. సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు వాటిలో ఉండే విలువైన డేటాను కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే భావనతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఈ కేసులపై ప్రత్యేక దృష్టి సారించారు. మిస్సింగ్ మొబైల్ ఫోన్లను ట్రేస్ చేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్ పోతే, వెంటనే మీ సిమ్‌ కార్డును బ్లాక్ చేయించడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం, గూగుల్‌ Find మై డివైస్‌ విధానంతో సెల్‌ ఫోన్లను లాక్‌ చేయడం, డేటాను ఎరేజ్ చేయడం, బ్యాంకింగ్ యాప్‌లు, సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లు మార్చడం, అలాగే IMEI నంబర్‌తో CEIR పోర్టల్లో బ్లాక్ చేయడానికి ప్రయత్నించడం వంటి పనులు చేయాలని సూచించారు. సెల్‌ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాశం జిల్లాలో పోలీసులు మొబైల్ ట్రేసింగ్ ద్వారా గత 3 నెలల్లో 50 లక్షల విలువైన 342 సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించారు. యాపిల్, శాంసంగ్, వివో, రెడ్మి, ఒప్పో, వన్‌ తదితర కంపెనీలకు చెందిన మొత్తం 342 మొబైల్ ఫోన్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించి… జిల్లా పోలీసు కార్యాలయంలో సెల్ ఫోన్లను యజమానులకు అందించారు. గత ఐదేళ్ళ నుంచి ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో 9 కోట్ల 50 లక్షల విలువైన 6,776 కు పైగా మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి బాధితులకు అందజేశారు. పోయిన మొబైల్ ఫోన్లను పోలీసులు అత్యంత త్వరితగతిన రికవరీ చేసి అందజేశారు. ఈ మొబైల్ ఫోన్లను రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా గుర్తించి రికవరీ చేశారు. ఎవరైనా ఎక్కువ విలువ గల మొబైల్ ఫోన్లు తక్కువ ధరకు సెకండ్ హ్యాండ్ రూపంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తే, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి ఫోన్లను కొనవద్దని ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా మొబైల్ ఫోన్లు అమ్మడానికి వస్తే, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మత్స్యకారుల వలలో అరుదైన చేపలు.. అబ్బా అదృష్టం అంటే వీళ్లదే