Srisailam: శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్

Updated on: Dec 28, 2025 | 4:51 PM

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి ఈదుతూ కనిపించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. కృష్ణా నది గుండా పులులు నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ నుంచి అమ్రాబాద్‌ అభయారణ్యానికి రాకపోకలు సాగిస్తున్నాయి. ఇటీవల ఒక పులి పంట పొలాల్లో సంచరించినట్లు గుర్తించడంతో స్థానికులను అటవీ శాఖ అప్రమత్తం చేసింది. పులిని సురక్షితంగా అడవిలోకి పంపేందుకు పర్యవేక్షణ కొనసాగుతోంది.

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి. నదిలో రాజహంసలా వెళుతున్న పెద్దపులి చూపరులను కట్టిపడేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌లో ఏపీ వైపు నుంచి తెలంగాణ రాష్ట్రానికి చేరాలంటే కృష్ణా నదిలో సుమారు 2 కిలోమీటర్లు పడవ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ మార్గంలో స్థానికుల రాకపోకలు తరచూ సాగుతుండగా, ఇదే మార్గం గుండా కృష్ణా నదిలో పెద్దపులులు కూడా అలవోకగా రెండు కిలోమీటర్లు ఈదుకుంటూ ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగిస్తున్నాయన్నది ఆందోళనకు గురిచేస్తోంది. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ నుంచి అమ్రాబాద్‌ అభయారణ్యానికి పెద్దపులులు జలమార్గం ద్వారా సులభంగా రాకపోకలు చేస్తుండటం గమనార్హం. వారం రోజుల క్రితం ఆత్మకూరు డివిజన్‌లోని సంగమేశ్వరం సమీపంలో ‘టీ-65’ అనే పులి నదిలో ఈదుతూ అమ్రాబాద్‌ వైపు చేరింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అది నేరుగా అడవిలోకి కాకుండా కొల్లాపూర్ మండలంలోని పంట పొలాల్లో సంచరిస్తున్నట్లు పెద్దపులి పాద ముద్రిక గల ద్వారా అటవీ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో నది సమీపంలోని స్థానికులు, మత్స్యకారులు రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. పులి కదలికలపై నిఘా ఏర్పాటు చేసినట్లు ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్‌ విగ్నేష్‌ వెల్లడించారు. పులి సురక్షితంగా అడవిలోకి తిరిగి చేరే వరకు పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను

గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌

విద్యుత్‌ స్తంభం ఎక్కిన ఎమ్మెల్యే.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే