Medaram Jathara: తెలంగాణ కుంభమేళా.. మేడారం జాతర విశిష్టత ఏంటంటే..

Updated on: Jan 31, 2026 | 11:51 AM

సమ్మక్క సారలమ్మ వనదేవతలుగా కొలువబడే మేడారం జాతర, ఆసియా అతిపెద్ద గిరిజన పండుగ. కాకతీయులపై వీరోచితంగా పోరాడిన వనదేవతలు గిరిజనుల గుండెల్లో కొలువుదీరారు. విగ్రహాలు, మంత్రాలు లేని ఈ జాతరలో భక్తుల గుండెలే దేవాలయాలు. ఆదివాసీ సంస్కృతి, ఆచారాలకు నిలువెత్తు నిదర్శనమైన ఈ తెలంగాణ కుంభమేళాను లక్షలాది మంది భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు.

కప్పం కట్టాల్సిందేనని కాకతీయ సేనలు మీదకొస్తే అపర కాళికలయ్యారు. గిరిజనులకు పన్ను నుంచి విముక్తి కలిగించి వారి గుండెల్లో కొలువుదీరారు సమ్మక్క, సారలమ్మ. ఆ వనదేవతల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే, వనదేవతలుగా వర్ధిల్లుతున్న సమ్మక్క-సారలక్కను గిరిజనులు భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరు తెచ్చుకుంది. మండపాలు కట్టలేదు! విగ్రహాలు ప్రతిష్ఠించలేదు! వేద మంత్రాలు లేవు! భక్తుల గుండెలే దేవాలయాలు. గద్దెలపై ఉన్న వెదురు కర్ర, కుంకుమభరిణలే వనదేవతల ప్రతిరూపాలు. తల్లుల త్యాగాన్ని తలుచుకుంటూ వందల ఏళ్లుగా చేసుకుంటున్న వేడుక ఇది. అంతేకాదు, ఆదివాసీల సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం. అందుకే, వనదేవతలను కొలిచేందుకు లక్షలాది భక్తులు వస్తారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పిస్తారు. అంతటి ప్రాముఖ్యత ఉంది మేడారం మహా జాతరకు. దేశంలో అనేక జాతరలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో జాతరలు కొదవ లేదు. కానీ, అన్నింటికంటే మేడారం జాతరకు ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. కాకతీయులపై కత్తిదూసిన సమ్మక్క సారలమ్మలే అడవి బిడ్డలకు ఆరాధ్య దైవాలుగా నిలిచారు. అందుకే, మాఘ మాసంలో నిండు పున్నమి వెలుగుల్లో వన దేవతలను దర్శించుకునేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌ సహా దేశం నలుమూలల నుంచి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం జాతర జరిగేది 4 రోజులే. ఆద్యంతం ఆదివాసీల సంస్కృతిని చాటి చెబుతూ జరుగుతుంది. ఓ ఏడాది చిన్న జాతరగా మరో ఏడాది మహాజాతరగా జరుగుతుంది. మహా జాతర సమయంలో మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో భక్తి పరవశిస్తుంది. ప్రతి ఒక్కరు సమ్మక్క సారలమ్మలను ఇళ్లల్లో పెట్టుకుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆ తర్వాత వేములవాడ లేదా దగ్గర్లో ఉండే ఇతర దేవాలయాలను దర్శించుకుని మేడారం జాతరకు తరలివెళ్తారు. జంపన్న వాగులో స్నానాలు చేసి అమ్మలకు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించు కుంటారు. అడవిలోనే సామూహిక భోజనాలు చేస్తారు. చెట్ల కిందే విడిది చేస్తారు. ఫలితంగా సమ్మక్క- సారలమ్మ గద్దెలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Medaram Jatara 2026: మేడారంలో వెలసిన సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పాయింట్లు

అమెరికా యుద్ధనౌకలు పశ్చిమాసియాలోకి ఇరాన్‌తో యుద్ధం తప్పదా

Black Egg: నల్ల కోడి గుడ్డు తిన్నారా ?? తింటే ఆయుష్షు పెరుగుతుందట

తల్లిదండ్రుల హత్య కేసులో కూతురు సురేఖ అరెస్ట్

బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??