శబరిమల యాత్రికులకు గుడ్‌ న్యూస్‌..! భోజనంలో మార్పు

Updated on: Nov 28, 2025 | 1:43 PM

శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త అందించింది. అన్నదానం మెనూను పూర్తిగా మార్చి, ఇకపై సాంప్రదాయ కేరళ సద్యను అందిస్తుంది. అప్పడాలు, పాయసంతో కూడిన ఈ భోజనం భక్తుల విరాళాలతో ఏర్పాటు చేయబడింది. నాణ్యమైన పదార్థాలతో రుచికరమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పంబలో కూడా అన్నదానం సేవలు మెరుగుపరుస్తారు. ఇది భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని పెంచుతుందని బోర్డు ఆశిస్తోంది.

శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. ఆలయంలో అందిస్తున్న అన్నదానం మెనూను పూర్తిగా మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు భక్తులకు మధ్యాహ్న భోజనంలో వెజ్ పులావ్, సాంబారుతో భోజనం పెడుతున్నారు. ఇప్పుడు ఈ మెనూలో మార్పులు చేశారు. ఇకపై అప్పడాలు, పాయసంతో కూడిన సద్య అంటే పూర్తిస్థాయి కేరళ సంప్రదాయ భోజనం వడ్డించనున్నట్లు తెలిపింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం కొత్త అధ్యక్షుడు కె. జయకుమార్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జయకుమార్ స్పందిస్తూ… ఇది దేవస్వం బోర్డు డబ్బు కాదని, తోటి భక్తులకు ఉత్తమమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో భక్తులు సమర్పించిన విరాళాలతో ఈ భోజనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నాణ్యమైన పదార్థాలతో సంప్రదాయ కేరళ సద్యను అందించాలని నిర్ణయించామని వివరించారు. ఈ నిర్ణయం త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. పంబలో కూడా అన్నదానం సేవలను మెరుగుపరుస్తామని, యాత్రికుల సౌకర్యార్థం ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తున్నామని అన్నారు. దీనిపై డిసెంబర్ 18న సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మండల-మకరవిళక్కు సీజన్ కావడంతో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శబరిమలకు తరలివస్తున్నారు. అయినప్పటికీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారికి దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లు సజావుగా సాగుతున్నాయని బోర్డు తెలిపింది. ఆలయం వెనుక మాలికాపురంలోని అన్నదాన భవనంలోనే రోజూ 10,000 మందికి పైగా భక్తులకు ఉచితంగా భోజనం అందిస్తున్నారని తెలిపారు. ఈ సీజన్‌లో ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు అన్నదానం స్వీకరించారని వెల్లడించారు. ఈ అన్నదాన సత్రంలో మొత్తం 235 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పెషల్ ఆఫీసర్ సునీల్ కుమార్ తెలిపారు. భక్తులు కడిగిన ప్లేట్లు, గ్లాసులను వేడినీటితో డిష్‌వాషర్లలో మళ్లీ శుభ్రం చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కొత్త మెనూ మార్పు భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని మరింత పెంచుతుందని బోర్డు భావిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వృద్ధులకు గుడ్‌న్యూస్‌..! భారీగా పెరిగిన ఆయుష్మాన్ భారత్ హెల్త్‌ కవరేజ్‌

బంగారం కొంటున్నారా.. బీకేర్‌ఫుల్‌ తక్కువ క్వాలిటీ బంగారంపై ప్యూరిటీ ముద్ర

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై టిటిడి క్లారిటీ.. ఈసారి స్థానికులకు ఇంపార్టెన్స్

రాత్రి వేళ ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడు.. కట్‌చేస్తే.. అంత బట్టబయలు

ఎస్వీ యూనివర్శిటీలో చిరుత ప్రత్యక్షం.. భయాందోళనలో విద్యార్ధులు