Weekend Hour: తెలంగాణలో హీటెక్కుతున్న రాజకీయం.. స్టేట్ ఎలక్షన్.. సెంట్రల్ డైరెక్షన్
నవంబర్-డిసెంబర్‌లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు BRS ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ నేతల నుంచి దరఖాస్తుల స్వీకరణను కాంగ్రెస్ పూర్తి చేసింది. తాజాగా రైతు గోస - బీజేపీ భరోసా పేరుతో కమలనాథులు ఎన్నికల రణక్షేత్రంలోకి దూకారు. తెలంగాణలో ఏర్పడేది తమ ప్రభుత్వమేనని ఖమ్మం సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘంటాపథంగా చెప్పారు
ఎన్నికలకు ముహూర్తం సమీపిస్తున్న కొద్ది తెలంగాణలో రాజకీయం రోజుకింత వేడెక్కుతోంది. రెండు జాతీయ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ నేతలకు ఢిల్లీ పెద్దలు దిశానిర్దేశం చేస్తున్నారు. నిన్న చేవెళ్లలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎస్‌సీ ఎస్‌టీ డిక్లరేషన్ ప్రకటించారు. ఇప్పుడు రైతు గోస- బీజేపీ భరోసా పేరుతో ఖమ్మంలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సమావేశం ద్వారా బీజేపీ శ్రేణులను రాబోయే ఎన్నికలకు సన్నద్ధం చేశారు అమిత్ షా. వాస్తవానికి జూన్‌లోనే ఈ సభ నిర్వహించాలని బీజేపీ భావించింది. రకరకాల కారణాలతో అది వాయిదా పడుతూ వస్తోంది. రైతు సంక్షేమం కోసం పాటు పడుతున్న ప్రభుత్వం తమదని ఖమ్మం సభలో అమిత్ షా ప్రకటించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక, మహిళా వ్యతిరేక, యువత వ్యతిరేక ప్రభుత్వమని అమిత్ షా ఆరోపించారు. అదే సమయంలో ఎన్నికల తర్వాత, BRS, BJP ఒక్కటవుతాయన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను తప్పుబట్టారు. మజ్లిస్‌తో వేదిక పంచుకునే వాళ్ల పక్కన కూడా తాము కూర్చొమని ప్రకటించారు. మొత్తానికి ఖమ్మం సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో రానున్న రోజుల్లో తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత పెరగడం తథ్యం.