Lagadapati Rajagopal : మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి..! అనుచరుల కీలక భేటీ

| Edited By: Ram Naramaneni

Sep 06, 2023 | 1:33 PM

లగడపాటి అనుచరుల సమావేశాలతో ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్ర విభజన బిల్లు ఆమోద సమయంలో పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే కొట్టి సంచలనం సృష్టించారు లగడపాటి. అప్పట్లో ఆయన పేరు మారుమోగిపోయింది. అలానే ఆయనకు ఆంధ్రా ఆక్టోపస్ అనే పేరుంది. ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేయడంతో ఆయనను ఎక్స్‌పర్ట్ అంటుంటారు. అయితే 2019 సమయంలో మాత్రం ఆయన సర్వేలు పూర్తిగా తప్పాయి. 

బెజ‌వాడ‌లో జ‌రుగుతున్న తాజా రాజ‌కీయ ప‌రిణామాలు చూస్తే లగడపాటి మ‌ళ్లీ రావొచ్చేమో అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి. 2004,2009 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా రెండుసార్లు ఎంపీగా గెలిచిన ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ విజ‌య‌వాడ పార్ల‌మెంట్ అభివృద్దిలో త‌న‌దైన మార్క్ వేసుకున్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న కాంగ్రెస్ పార్టీ నుంచి విజ‌య‌వాడ న‌గ‌రంతో పాటు ఏడు నియోజ‌క‌వర్గాల అభివృద్దికి ముఖ్య‌పాత్ర పోషించారు. పొలిటిక‌ల్ స‌ర్వేల్లో కూడా మంచి దిట్ట‌..ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో ప‌లు ప్ర‌యివేట్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఆ త‌ర్వాత మాజీ హోంమంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావును కూడా ఆయ‌న ఇంటికి వెళ్లి మ‌రీ క‌లిసారు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్..ఇ లా ప‌లుమార్లు విజ‌య‌వాడ చుట్టుప‌క్క‌ల ప‌ర్య‌ట‌న‌ల‌తో ల‌గ‌డ‌పాటి మ‌ళ్లీ రాజ‌కీయ ప్ర‌వేశం చేస్తారా అనే చ‌ర్చ కూడా మొద‌లైంది.ఇదే స‌మ‌యంలో ల‌గ‌డ‌పాటి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నార‌ని…ఆయ‌న‌కు ఏలూరు నుంచి లోక్ స‌భ టిక్కెట్ ఇస్తున్నార‌ని కూడా చ‌ర్చ జ‌రిగింది.అయితే ఈ విష‌యంపై ఆయ‌న మాత్రం మౌనంగానే ఉన్నారు.తాజాగా బెజ‌వాడ‌లో ఓ హోట‌ల్ లో స‌మావేశ‌మైన ఆయ‌న ముఖ్య అనుచ‌రులు ల‌గ‌డ‌పాటి మళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేలా స‌న్నాహాలు ప్రారంభించారు.

బెజ‌వాడ ఎంపీగా మ‌ళ్లీ రంగంలోకి దిగుతారా

ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ 2014,2019లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విజ‌యవాడ ఎంపీగా ప‌నిచేసారు.రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో లోక్ స‌భ‌లో పోరాడిన ఆయ‌న‌…రాష్ట్రం విడిపోతే శాశ్వ‌తంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని అన్నారు..ఆ త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న జ‌ర‌గ‌డంతో అన్న మాట ప్ర‌కారం త‌న పొలిటిక‌ల్ కెరీర్ కు ఫుల్ ప్టాప్ పెట్టేసారు రాజ‌గోపాల్..అప్పటి నుంచి ఆయ‌న ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు..ఏ పార్టీతోనూ ఆయ‌న సంబంధాలు కొన‌సాగించ‌డం లేదు.2019 లో మాత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ సాధార‌ణ ఎన్నిల‌క‌పై ఓ స‌ర్వే చేయించారు..ఆ స‌ర్వే ప్ర‌కారం మ‌ళ్లీ టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌నేది సారాంశం.కానీ స‌ర్వే అంతా త‌ల్ల‌క్రిందులైంది..అప్ప‌టి నుంచి మీడియాకు కూడా పూర్తిగా దూరంగా ఉంటున్నారు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్..ఆయ‌న‌కున్న వ్యాపారాల‌తోనే ఆయ‌న బిజీగా గ‌డుపుతున్నార‌ని తెలిసింది.అయితే ల‌గ‌డ‌పాటి ఎంపీగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న‌తో ఉన్న ముఖ్య అనుచరులు విజ‌య‌వాడ‌లోని ఒక ప్ర‌యివేట్ హోట‌ల్ లో స‌మావేశం అయ్యారు.త‌మ నాయ‌కుడిని మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు…ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ వ‌ల్లే విజ‌య‌వాడ గానీ పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు గానీ అభివృద్ది చెందాయ‌ని చెబుతున్నారు…అందుకే ఆయ‌న్నిరీఎంట్రీ ఇచ్చేలా ఒత్తిడి పెంచాల‌ని నిర్న‌యించారు.ఇక‌పై పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోని ల‌గ‌డ‌పాటి అనుచ‌రులు,కార్య‌క‌ర్త‌ల‌ను క‌లుపుకుని స‌మావేశాలు పెట్టాల‌ని ముఖ్య అనుచరులు నిర్న‌యించారు..సెప్టెంబ‌ర్ నెలాఖ‌రులో త‌మ నాయ‌కుడిని క‌లుసుకుని మ‌ళ్లీ పోటీలోకి దిగేలా ఒప్పిస్తామంటున్నారు.ఆయ‌న ఎంపీగా పోటీ చేయాలి త‌ప్ప‌…ఏ పార్టీ అయినా ఆయ‌న ఇష్టం అంటున్నారు.ఆయ‌న‌తో క‌లిసి స‌మావేశం ఏర్పాటు చేసే దిశ‌గా కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నారు.

ల‌గ‌డ‌పాటి రీఎంట్రీ ఇస్తే బెజ‌వాడ రాజ‌కీయ ప‌రిస్థితి ఏంటి?

మాజీ ఎంపీని రీఎంట్రీ చేయించాల‌ని అనుచ‌రులు ప్ర‌య‌త్నాలు మ‌రింత ముమ్మ‌రం చేయాల‌ని నిర్న‌యించారు..అయితే తాను మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటాన‌ని….మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి రాలేన‌ని ఆరు నెల‌ల క్రితం నందిగామ వ‌చ్చినప్పుడు కూడా రాజ‌గోపాల్ తెలిపారు.అయితే అనుచ‌రులు ఒత్తిడితో ఒక‌వేళ ఆయ‌న నిర్న‌యం మార్చుకుంటే విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో ఎలాంటి ప‌రిణామాలు జ‌రుగుతాయ‌నే చ‌ర్చ కూడా మొద‌లైంది..ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉన్న ఏ పార్టీతోనూ ద‌గ్గ‌ర‌గా లేరు.గ‌తంలో ఆయ‌న తెలుగుదేశం పార్టీలో చేర‌తార‌ని విజ‌య‌వాడ లేదా ఏలూరు టిక్కెట్ ఇస్తార‌ని చ‌ర్చ జ‌రిగింది..ల‌గ‌డ‌పాటి టీడీపీలో చేరినా ఆయ‌న‌కు విజ‌య‌వాడ ఎంపీ టిక్కెట్ ఇస్తార‌నే గ్యారంటీ లేదు.ఇప్ప‌టికే ఇక్క‌డ కేశినేని బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య సీటు పోరు నడుస్తోంది.ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం గ‌తంలో పోటీ చేసిన పొట్లూరి వ‌ర‌ప్ర‌సాద్ పార్టీకి దూరంగా ఉండ‌టంతో కొత్త అభ్య‌ర్ధి కోసం చూస్తుంది.అయితే ల‌గ‌డ‌పాటి వైసీపీ వైపు మొగ్గు చూపుతారా లేదా అనే చ‌ర్చ కూడా జ‌రుగుతుంది…కానీ రాజ‌గోపాల్ మాత్రం బ‌రిలో దిగితే ఖ‌చ్చితంగా అటు టీడీపీ,ఇటు వైసీపీ ల ఓట్ల‌ను చీల్చుతార‌న‌డంలో సందేహం లేదు.అయితే అనుచ‌రుల డిమాండ్,ఒత్తిడిని రాజ‌గోపాల్ ఏర‌కంగా తీసుకుంటారు,ఆయ‌న అభిప్రాయం ఎలా ఉంటుంద‌నేది తేలిన త‌ర్వాత మాత్ర‌మే రాజ‌కీయంగా కీల‌క ప‌రిణామాలు జ‌రిగే చాన్స్ ఉంటుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Sep 06, 2023 01:23 PM