ఏపీలో కొత్తగా 1.5 లక్షల పింఛన్లు !! దరఖాస్తులు తీసుకునేది ఎప్పటి నుంచి అంటే…?
కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది, ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న వితంతు పింఛన్లకు ప్రాధాన్యత ఇస్తోంది. దాదాపు 1.53 లక్షల మంది అర్హులైన వితంతువులకు నెలకు రూ.4,000 చొప్పున పింఛన్లు మంజూరు చేయనుంది. ఈ నిర్ణయం లక్షలాది మంది నిస్సహాయ మహిళలకు గణనీయమైన ఆర్థిక భరోసాను, దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు పెద్ద ఊరటను ఇస్తుంది. దరఖాస్తు ప్రక్రియ సరళతరం చేయబడింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల అమలులో భాగంగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఏర్పడి జూన్ 12 నాటికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న… కొత్తగా అర్హులైన వారందరి నుండి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించాలని యోచిస్తోంది. వితంతు పింఛను విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా 1.53 లక్షల మంది అర్హులుంటారని సెర్ప్ అంచనా. వీరందరికీ పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు. వీరికి రూ.4వేల చొప్పున పింఛను మంజూరుకు నెలకు రూ.61 కోట్లు ఖర్చుకానుంది. గత కొంతకాలంగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది సామాన్యులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక స్పౌజ్ కేటగిరీ కింద ఏ నెలకు ఆ నెల కొత్త పింఛన్లు మంజూరు చేస్తోంది. పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ పింఛనును మరుసటి నెలలోనే భార్య పేరు మీదకు బదలాయిస్తోంది. దీనికి స్పౌజ్ కేటగిరీగా పేరు పెట్టింది. ఆ కుటుంబం అప్పటివరకు పింఛను ఆసరా కోల్పోకుండా చేయూత ఇస్తోంది. ఇలా ఇప్పటివరకు 2.30 లక్షల మందికి కొత్తగా పింఛన్లు అందించింది. అయితే.. 60 ఏళ్ల లోపు వివాహితుడైన పురుషుడు చనిపోతే.. అతని భార్యకు వితంతు కేటగిరీలో వెంటనే పింఛను రావడం లేదు. దీంతో వారికీ వెంటనే పింఛను ఇవ్వాలని ఎమ్మెల్యేలు ప్రభుత్వం నోటీసుకు తేవడంతో ..వితంతు కేటగిరీలోని అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలకు తక్షణ ఆర్థిక భరోసా లభిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తమకు వితంతు పింఛన్లు అందలేదని పేర్కొంటూ వ్యక్తుల నుంచి ప్రభుత్వానికి భారీ సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. క్షేత్రస్థాయి తనిఖీల ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం 2019 నుంచి 2024 మధ్య కాలంలో 5,50,000 మంది వితంతువులైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే.. నాటి ప్రభుత్వ హయాంలో అర్హత లేని దరఖాస్తుదారులను వడపోసిన తర్వాత కూడా, సుమారు 2,00,000 మంది వ్యక్తులకు పలు ఇతర కారణాలు చెబుతూ పింఛన్లు నిరాకరించారు. వాస్తవానికి ఈ వ్యక్తులందరూ గత ప్రభుత్వం అమలు చేసిన ‘ఆరు దశల ధృవీకరణ ప్రక్రియ’ కింద పింఛన్లకు అర్హత సాధించారు. అయినప్పటికీ వారికి ఆ ప్రయోజనం కల్పించబడలేదు. ఈ వర్గానికి పింఛన్లు అందించేందుకు వీలుగా సంకీర్ణ ప్రభుత్వం ఆ వివరాలను తిరిగి ధృవీకరించే ప్రక్రియను చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా కొంతమంది దరఖాస్తుదారులు ఇప్పటికే మరణించినట్లు గుర్తించారు. మిగిలిన అర్హులైన వ్యక్తులకు జూన్ నెలలో పింఛన్లు మంజూరు చేయడానికి ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలతో పాటుగా ఆరోగ్య పింఛన్లతో కలిపి 28 కేటగిరీల్లో పంపిణీ చేస్తోంది. కొత్త పింఛన్ల కోసం దాదాపు 10 లక్షలమంది వరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరికి పింఛన్లు ఇవ్వాలంటే నెలకు రూ.400 కోట్లు.. అదే ఏడాదికి అయితే రూ.4,800 కోట్లు ఖర్చవుతుందనే అంచనాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాలలో కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి వితంతు పెన్షన్ల కోసమే దాదాపు 1.50 లక్షల దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు. వీరికి పింఛన్లు అందించిన తర్వాత.. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర కేటగిరీల వారి నుంచి కొత్తగా దరఖాస్తులు తీసుకోనున్నారు. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు ప్రక్రియను సరళతరం చేయనున్నారు. కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేయాలనుకునే మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి సంబంధిత వెల్ఫేర్ అసిస్టెంట్‌ను సంప్రదించాలి. ప్రభుత్వం నిర్ణయించిన వయస్సు, ఆదాయ పరిమితుల ప్రకారం మీరు అర్హులో కాదో ముందుగా ధృవీకరించుకోవాలి. అవసరమైన ఆధార్ కార్డ్, రైస్ కార్డ్, ఇతర ధృవీకరణ పత్రాలను అందజేయాలి. దరఖాస్తు సమయంలో లబ్ధిదారుని వేలిముద్రలు లేదా ఐరిష్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి విచారణ జరిపి, నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తారు.అన్నీ సక్రమంగా ఉంటే, మీ దరఖాస్తుకు ఓకే చెబుతారు. కొత్త పింఛన్ కార్డును జారీ చేస్తారు. దరఖాస్తు చేయాలనుకునే వారు లబ్ధిదారుని గుర్తింపు, వయసు నిర్ధారణ కోసం ఆధార్ కార్డ్, పేదరిక రేఖకు దిగువన ఉన్నట్లు ధృవీకరించడానికి రైస్ కార్డ్, మరణ ధృవీకరణ పత్రం. వితంతు పింఛన్ దరఖాస్తు కోసం భర్త మరణ ధృవీకరణ పత్రం, నగదు జమకావడానికి బ్యాంక్ ఖాతా వివరాలు రెడీ చేసి పెట్టుకోవాలి.వితంతు కేటగిరిలో పింఛన్లు మంజూరు చేసిన తర్వాత అర్హులైన దివ్యాంగులకు కొత్త పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దివ్యాంగుల విభాగం కింద ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్న 6,50,000 మందిలో 1,00,000 మందికి పైగా అర్హులు కాదని వైద్య పరీక్షల ద్వారా వెల్లడైంది. ప్రభుత్వ వార్షికోత్సవం సందర్భంగా ఈ భారీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అర్హులైన వారెవరూ కూడా రాజకీయ కారణాలతో లేదా సాంకేతిక కారణాలతో నష్టపోకూడదని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజుల్లోనే వెరిఫికేషన్ పూర్తి చేసి, మంజూరు పత్రాలను అందజేసేలా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పెంచిన పెన్షన్ నిధులతో పాటు కొత్త లబ్ధిదారులను చేర్చుకోవడం వల్ల ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడినా, సంక్షేమమే ప్రాధాన్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేశం పరువు తీశారుగా..! ఛీ.. అలా ఎలా చేశారురా
ఆ జిల్లాల్లో బయట కాలు పెడితే అంతే !! అధికారుల సీరియస్ వార్నింగ్
అన్నం పెట్టిన చేతిని మరువని శునకాలు.. మహిళ హత్య గుట్టు రట్టు