My India My Life Goals: పర్యావరణ పరిరక్షణలో కేంద్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలతో కలిసి సామాజిక కార్యకర్తలు కథంతొక్కుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతు కృషి చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తూ దేశ, విదేశీ ప్రశంసలు అందుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణ ఏ ఒక్కరిదో కాదు.. అందరి బాధ్యతగా తమ కార్యక్రమాలతో చాటుతున్నారు.
పర్యావరణ పరిరక్షణలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన జాదవ్ మొలాయ్ పాయెంగ్. 1979లో 16 ఏళ్ల బాలుడిగా రోజుకు ఒక మొక్కను నాటడం మొదలుపెట్టిన జాదవ్.. అప్పటి నుంచి గత 42 ఏళ్లుగా మొక్కలు నాటుతూనే ఉన్నారు. జాదవ్ అవిశ్రాంతి ఉద్యమంతో.. ఒంటి చేత్తో అస్సాంలో 550 హెక్టార్ల విస్తీర్ణంకు పైగా అడవిని సృష్టించి శభాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం 1360 ఎకరాల విస్తీర్ణంలో ములాయి అడవి విస్తరించి ఉంది. పర్యావరణ పరిరక్షణ కోసం 4 దశాబ్ధాలకు పైగా జాదవ్ పాయెంగ్ అందిస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. పద్మ శ్రీ పురస్కారంతో గౌరవించింది. పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఆయన సేవలను గుర్తించి అవార్డులు ప్రదానం చేశాయి.