AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!

పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!

Phani CH
|

Updated on: Sep 11, 2026 | 8:00 PM

Share

మార్కాపురం జిల్లాలో వరుస ఆలయ చోరీల కేసును పోలీసులు ఛేదించారు. పగటిపూట భక్తులుగా ఆలయాలకు వెళ్లి రెక్కీ నిర్వహించి, రాత్రివేళ చోరీలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఓ పూజారి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.22.70 లక్షల విలువైన బంగారం, వెండి నగలు, విగ్రహాలు, రెండు కార్లు, బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

దేవుడు కరుణించినా పూజారి కరుణించడు అన్నది పాత మాట. ఇప్పుడు పూజారే దొంగ అయితే.. దేవుడికి రక్షణ ఎక్కడ అన్నట్టుగా మారిపోతోంది పరిస్థితి. పగటిపూట అపర భక్తులుగా వచ్చి దేవుడికి దండం పెట్టి, రాత్రి సమయంలో అదే దేవుడి సొమ్మును దోచుకుంటున్న ముఠా గుట్టు రట్టుచేశారు మార్కాపురం జిల్లా పోలీసులు. మార్కాపురం జిల్లా పరిధిలోని సి.ఎస్.పురం, పామూరు, కనిగిరి, కొనకనమిట్ల మండలాల్లోని పలు దేవాలయాల్లో ఇటీవల వరుస చోరీలు జరగడం కలకలం రేపింది. ఈ కేసులను ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కనిగిరి డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సాంకేతిక ఆధారాలు, ఇన్‌ఫార్మర్ల సమాచారంతో పోలీసులు కూపీ లాగారు. ఈ క్రమంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బేల్దారి కూలీలుగా పనిచేసే వీరంతా పగటిపూట ఆలయాలకు వెళ్లి పూజలు చేసేవారు. అదే సమయంలో గుడి రూపురేఖలు, సెక్యూరిటీని పరిశీలించి రెక్కీ నిర్వహించేవారు. ఈ ముఠాలో ఓ పూజారి కూడా ఉండటం గమనార్హం. పాత నేరస్తుడైన సోమేపల్లి ఉమామహేశ్వరరావు అనే పూజారి, సులభంగా డబ్బు సంపాదించవచ్చంటూ మిగతావారికి ఈ దొంగతనాల మంత్రం నూరిపోశాడు. అలా పగలు పూజారిగా, భక్తులుగా నటించిన వీరు.. రాత్రిళ్లు తాళాలు పగలగొట్టి హుండీలు, బంగారు, వెండి నగలను దోచుకునేవారు. ఎట్టకేలకు పామూరు మండలం రావిగుంటపల్లి శివారులో పోలీసులు ఈ ముఠాలోని 13 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి ఏకంగా 22 లక్షల 70 వేల రూపాయల విలువైన నగలు, విగ్రహాలు, రెండు కార్లు, బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కష్టపడి బతకాల్సిన వీరు, కంచే చేను మేసిన చందంగా దేవుడి సొమ్ముకే కన్నం వేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఘాట్‌రోడ్‌లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!

ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన

క్రికెట్‌ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం

గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?

రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!

Follow Us