Kurnool: వెంటాడుతున్న కొండరాయి ‘గండం’.. 18 రోజులుగా భయం గుప్పెట్లోనే గ్రామస్తులు..!
కర్నూలు జిల్లాలో బాహుబలి కొండరాయి భయం కొనసాగుతోంది. గోనెగండ్లలో 55 అడుగుల ఎత్తు ఉన్న కొండరాయి నిలువునా చీలడం స్థానికులను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
కర్నూలు జిల్లాలో బాహుబలి కొండరాయి భయం కొనసాగుతోంది. గోనెగండ్లలో 55 అడుగుల ఎత్తు ఉన్న కొండరాయి నిలువునా చీలడం స్థానికులను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.ఈ నెల 11 వ తేదీ ఎండవేడికి కొండరాయి పగలగా.. 18 రోజులు గడిచిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గోనెగండ్లలో ఎస్సీ కాలనీ వాసులు ఇంకా భయం గుప్పెట్లోనే ఉన్నారు. అధికారులు ఇంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో.. వాళ్లు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.
గత రెండు రోజుల క్రితం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురువడంతో కొండరాయి పగుళ్ళలో తేడాలు వచ్చాయి. దీంతో చీలిన కొండరాయి కిందపడితే ఎలా..? అని కాలనీవాసుల ఆందోళన వర్ణణాతీతంగా మారింది. అయితే దీనిపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి గ్రామస్తులతో కలిసి జిల్లా కలెక్టర్ సృజనను కలిశారు. కొండరాయి పగుళ్లతో గ్రామస్తులు పడుతున్న భయం గురించి కలెక్టర్‌కి వివరించారు. అధికారులు వెంటనే అక్కడ ఉన్న కొండరాయిను తొలగించాలని కలెక్టర్‌ను ఎమ్మెల్యే కోరారు.