ఇక పై డాక్టర్ చిట్టీ ఉంటేనే దగ్గు మందు! కాఫ్ సిరప్ కు బానిసగా యూత్.. చిన్నారుల ప్రాణం తీసే సిరప్!
దగ్గు మందుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు, జలుబు సిరప్‌లను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడికల్ షాపులు విక్రయించాలి. 1945 ఔషధ నిబంధనల్లో సవరణలు చేస్తూ కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే లైసెన్స్ రద్దుతో పాటు భారీ జరిమానాలు విధించనున్నట్లు హెచ్చరించింది.
దేశంలో దగ్గు మందుల విక్రయాలపై కేంద్ర ఆరోగ్య శాఖ కఠిన నిబంధనలు తెచ్చింది. 1945 ఔషధ నిబంధనలను సవరిస్తూ ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి చేసింది. దేశంలో మందుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేలా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త నిబంధన తెచ్చింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దగ్గు, జలుబు వస్తే నేరుగా మెడికల్ షాపునకు వెళ్లి కొనుగోలు చేసే దగ్గు మందులపై కేంద్రం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడికల్ షాపుల వారు దగ్గు మందులను విక్రయించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. కేంద్ర ఆరోగ్య శాఖ 1945 నాటి ఔషధ నిబంధనలలో సవరణలు తీసుకువచ్చింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా సాధారణంగా ఓవర్ ది కౌంటర్ లభించే దగ్గు నివారణ మందులను ఇకపై షెడ్యూల్ K జాబితా నుంచి శాశ్వతంగా తొలగించింది. సాధారణంగా ఈ షెడ్యూల్ పరిధిలో ఉండే ఔషధాల విక్రయాలకు కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి, కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ వెసులుబాటును కేంద్రం రద్దు చేసింది. దగ్గు, గొంతు నొప్పి, జలుబు ఉపశమనం కోసం వాడే సిరప్‌లను ఇకపై మెడికల్ షాపుల్లో నేరుగా ఓవర్-ది-కౌంటర్ పద్ధతిలో అమ్మడానికి వీల్లేదు. అర్హత కలిగిన రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ రాసిచ్చిన పత్రం చూపిస్తేనే ఫార్మసిస్ట్లు ఈ మందులను కస్టమర్లకు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గు మందులు అమ్మినట్లు తేలితే మెడికల్ షాపు లైసెన్స్ రద్దు చేయడంతో పాటు భారీ జరిమానా విధించేలా కొత్త రూల్స్ రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో యువత, పాఠశాల విద్యార్థులు సైతం కొన్ని రకాల దగ్గు మందులను మత్తు కోసం, పరిమితికి మించి ఇష్టానుసారంగా వాడుతున్నట్లు నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీనికి తోడు, వైద్యుడి సలహా లేకుండా సొంత వైద్యం వల్ల ప్రజల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా భారతీయ సిరప్‌ల నాణ్యతపై గతంలో కొన్ని వివాదాలు వచ్చాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్య భద్రత కోసమే ఈ నిర్ణయం అని కేంద్రం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల మందుల బ్లాక్ మార్కెటింగ్‌కు, దుర్వినియోగానికి బ్రేక్ పడనుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వరుసగా చిన్నారుల మరణాలు నమోదుకావడం 2025 అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. పెద్దలకు వాడే దగ్గు సిరప్ తాగిన మధ్యప్రదేశ్ లోని చింద్వారాకు చెందిన 22 మంది చిన్నారులు మరణించగా.. కొందరు అస్వస్థతకు గురయ్యారు. పిల్లలకు ఇచ్చిన కోల్డ్‌రిఫ్ దగ్గుమందుపై ఔషధ నియంత్రణ సంస్థ చేపట్టిన పరీక్షల్లో షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. ఆ దగ్గు సిరప్ ను సూచించిన డాక్టర్ ప్రవీణ్ సోనిని పోలీసులు అరెస్టు చేశారు. సిరప్‌ను తయారు చేపిర తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రీసన్ ఫార్మా యూనిట్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఆ కంపెనీ తయారు చేసిన దగ్గు మందును తనిఖీ చేయగా అందులో 48.6 శాతం డైఇథైలిన్ గ్లైకాల్ ఉందని తేలింది. ఇది అత్యంత విషపూరితమైనదిగా అధికారులు తెలిపారు. మరో ఘటనలో జైపూర్‌కు చెందిన కేసన్స్ తయారుచేసిన సిరప్‌కు నిర్వహించిన నాణ్యతా పరీక్షల్లో 40 నమూనాలు విఫలమైనట్లు అధికారులు గుర్తించారు. దాంతో ఈ సిరప్‌పై తాత్కాలిక నిషేధం విధించారు. కిడ్నీ సంబంధిత సమస్యలున్న పిల్లలు ఈ సిరప్ తీసుకోవడం వల్ల మరింత తీవ్రమైన ప్రభావం పడుతోందని అధికారులు గుర్తించారు. 2 ఏళ్ల లోపు చిన్న పిల్లలకు దగ్గు సిరప్ వాడకూడదని.. 5 ఏళ్ల లోపు చిన్నారులకు దగ్గు సిరప్‌ను సూచించవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపిన వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్నారుల మరణాలకు కారణమైన ఆ దగ్గుమందును ఇతర ఏ ఏ దేశాలకు ఎగుమతి చేశారంటూ భారత్‌ను డబ్ల్యూహెచ్ఓ అడిగింది. గతంలో కొడిన్ దగ్గుమందు నైజీరియాలో లక్షలాది మందిని మత్తులో ముంచేసింది. దేశమంతటా యువతరం ఈ మందును మాదక ద్రవ్యంలా ఉపయోగించారు. ఈ దగ్గు మందుకు బానిసలైన వారి సంఖ్య బాగా పెరిగింది. డాక్టర్లు చీటీ మీద రాసిస్తే మాత్రమే అమ్మాల్సిన ఆ మందు డ్రగ్ డీలర్ల చేతుల్లోకి పోయి.. వీధుల్లో అక్రమ వ్యాపారానికి కారణమైంది. ఈ అంశాలపై అంతర్జాతీయ మీడియా ఆరా తీస్తే ఈ కుంభకోణంలో బడా ఫార్మా కంపెనీలున్నాయని వెల్లడైంది. నైజీరీయా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక రోజులో సుమారు 30 లక్షల సిరప్ సీసాలు అమ్ముడుపోయేవి. దీని తియ్యని స్ట్రాబెర్రీ రుచి పూర్తిగా బానిసగా మార్చేస్తుంది. కొడీన్ సిరప్ ను పరిమితికి మించి వాడితే అది మెదడుపై ప్రభావం చూపడమే కాదు ఉన్మాదిగా మార్చేస్తుందనీ నిపుణులు హెచ్చరించారు. ప్రభుత్వ పునరావాస కేంద్రంలో ఎక్కడ హింస చెలరేగుతుందోనని బాధితుల్ని గొలుసులతో కట్టేసి ఉంచాల్సి వచ్చింది. ప్రపంచానికి చౌకగా, నాణ్యమైన మందులు అందించే దేశంగా భారత్‌కు “ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్” అనే గుర్తింపు ఉంది. అయితే అక్టోబర్ 2025లో జరిగిన చిన్నారుల మరణాలు ఈ ప్రతిష్ఠపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ వివాదం 2022లో ఆఫ్రికా దేశమైన గాంబియాలో మొదలైంది. అక్కడ పలువురు చిన్నారులు అనారోగ్యానికి గురై మరణించడంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర హెచ్చరికను జారీ చేసింది. ప్రయోగశాల పరీక్షల్లో కొన్ని పిల్లల సిరప్‌లలో ప్రమాదకర స్థాయిలో డైఎథిలీన్ గ్లైకాల్ (DEG), ఎథిలీన్ గ్లైకాల్ (EG) అనే విషపూరిత రసాయనాలు ఉన్నట్లు తేలింది. మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ దగ్గుకు కూడా డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సి రావడం కొంత ఇబ్బందికరమైన విషయమే అయినప్పటికీ.. దీర్ఘకాలిక ప్రజారోగ్య ప్రయోజనాలు, మత్తు పదార్థాల నియంత్రణను పరిగణనలోకి తీసుకుంటే ఇది ఎంతో అవసరమైన నిర్ణయమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సహారాలోనూ తప్పని ఆన్‌లైన్ మీటింగ్! ఒంటెపై ల్యాప్‌టాప్‌తో..
ఏంటి ఈ సరికొత్త ఆన్‌లైన్ షాపింగ్ విధానం?
ఇది కదా సంపాదనంటే! ఒక్క రీల్‌కు రూ.80 లక్షలు..