సముద్రం అడుగున పైప్‌లైన్.. గ్యాస్ కష్టాలకు చెక్ పడేనా

Updated on: May 19, 2026 | 4:58 PM

స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, ఓమన్ నుంచి గుజరాత్ వరకు సముద్ర గర్భంలో 2,000 కిలోమీటర్ల భారీ గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణానికి భారత్ సిద్ధమవుతోంది. రూ.40 వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా మధ్యప్రాచ్య దేశాల నుంచి నేరుగా గ్యాస్ దిగుమతి చేసుకుని, ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయాలని కేంద్రం భావిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడల్లా భారత్‌కు ఇంధన సరఫరా నిలిచిపోతుందేమోనన్న ఆందోళన ఉండేది. అయితే, ఈ ముప్పుకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మధ్య ప్రాచ్య దేశాల నుంచి నేరుగా భారత్‌కు గ్యాస్ తీసుకొచ్చేలా సముద్రం అడుగున ఒక భారీ పైప్‌లైన్ నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తోంది. సముద్ర గర్భంలో 2 వేల కిలోమీటర్ల ప్రయాణం! సుమారు రూ.40,000 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును మిడిల్ ఈస్ట్-ఇండియా డీప్-వాటర్ పైప్‌లైన్ (MEIDP) అని పిలుస్తున్నారు. ఓమన్ దేశం నుంచి గుజరాత్ తీరం వరకు అరేబియా సముద్రం అడుగున దాదాపు 2,000 కిలోమీటర్ల మేర ఈ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తయితే, ఎల్ఎన్‌జీ దిగుమతుల కోసం ఇతర దేశాల నౌకలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. నేరుగా పైప్‌లైన్ ద్వారానే ప్రతిరోజూ 31 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు భారత్‌కు చేరుతుంది. ప్రపంచంలోనే అత్యంత లోతైన పైప్‌లైన్ ఈ ప్రాజెక్టు సాంకేతికంగా ఎంతో సవాలుతో కూడుకున్నది. సముద్ర మట్టానికి సుమారు 3,450 మీటర్ల లోతులో ఈ పైప్‌లైన్‌ను నిర్మించనున్నారు. అంటే ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్ర గర్భ పైప్‌లైన్లలో ఒకటిగా నిలవబోతోంది. దీనివల్ల అంతర్జాతీయ జలాల్లో తలెత్తే రాజకీయ ఉద్రిక్తతలు లేదా సముద్రపు దొంగల బెడద వంటి సమస్యలు ఏవీ మన గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగించలేవు. ఈ భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించే బాధ్యతను గెయిల్ (GAIL), ఇండియన్ ఆయిల్, ఇంజనీర్స్ ఇండియా వంటి ప్రభుత్వ దిగ్గజ కంపెనీలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల చమురు, గ్యాస్ ధరలు తగ్గటమే గాక ఇంధన భద్రత పెరుగుతుంది. ప్రస్తుతం భారత్ గ్యాస్ కోసం మిడిల్ ఈస్ట్‌ దేశాల పై ఆధారపడుతోంది. దీనివల్ల అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరిగినప్పుడు మనపై భారం పడుతోంది. పైప్‌లైన్ అందుబాటులోకి వస్తే గ్యాస్ ధరలు స్థిరంగా ఉండటమే కాకుండా చాలా తక్కువ ధరకు లభిస్తాయి. కేవలం ఓమన్ నుంచే కాకుండా ఈ పైప్‌లైన్ ద్వారా భవిష్యత్తులో యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, ఇరాన్ వంటి దేశాల నుంచి కూడా గ్యాస్ దిగుమతి చేసుకునే అవకాశం భారత్‌కు కలుగుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి 5 నుంచి 7 ఏళ్లు పట్టే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోమా నుంచి మేల్కొన్న యువతి.. లేని పిల్లల కోసం ఆరాటం

500 బ్రెడ్‌లతో భారీ డ్రెస్.. బేకరీ ప్రమోషన్ కోసం నటి వినూత్న ప్రయోగం

అరుదైన దృశ్యం.. ఒకే చోట మూడు పాముల ‘సయ్యాట’

Follow Us