తొలి విడత జనగణనకు సర్వం సిద్ధం.. ముందుగా లెక్కించేది వాటినే

Updated on: Dec 28, 2025 | 4:56 PM

భారత జనగణన 2027 కోసం కేంద్రం సన్నాహాలు ముమ్మరం చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ రూ. 11,718 కోట్లు కేటాయించింది. ఈసారి జనగణన డిజిటల్ పద్ధతిలో రెండు దశల్లో జరుగుతుంది. 2026 ఏప్రిల్-సెప్టెంబర్‌లో గృహాల లిస్టింగ్, 2027 ఫిబ్రవరి-మార్చిలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. ప్రీ-టెస్ట్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.

దేశంలో జనగణనకు కేంద్రం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రధాని మోదీ అధ్యక్షతన ఇటీవల సమావేశమైన కేంద్ర కేబినెట్‌ జనగణనకు రూ.11,718 కోట్లు కేటాయించింది. రెండు దశల్లో .. డిజిటల్‌ పద్దతిలో ఈసారి జనగణన జరుగుతుందని తెలిపారు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌. జనగణన కోసం దేశవ్యాప్తంగా 30 లక్షల మంది సిబ్బంది రంగంలోకి దిగనున్నారు. జనగణనలో తొలిదశలో భాగంగా 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు దేశంలోని ఇండ్ల జాబితాను రెడీ చేస్తారు. అనంతరం 2027 ఫిబ్రవరి నుంచి జనాభా లెక్కల సేకరణ చేపడతారు. ఈ మేరకు జనాభా లెక్కింపునకు సంబంధించిన ప్రీ-టెస్ట్‌ ప్రక్రియ ముగిసింది. జనగణన తొలి విడతలో భాగంగా 2026 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు దేశంలోని ఇళ్ల వారీగా వివరాలను సేకరించనున్నారు. దీన్ని ‘గృహాల లిస్టింగ్, గణన’ ప్రక్రియ అంటారు. యావత్‌ దేశంలోని ఇళ్ల వివరాలను ఎలా సేకరించాలి? ఇందుకోసం ఏ విధమైన మార్గదర్శకాలను అనుసరించాలి? సిబ్బంది సేవలను ఎలా వినియోగించుకోవాలి? అనే దానిపై ప్రీ-టెస్ట్‌లో ముమ్మర కసరత్తు చేశారు. పారదర్శకంగా ఇళ్ల వివరాల సేకరణకు అనుసరించాల్సిన మార్గాలపై అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, ఉప జిల్లాల స్థాయిలోని అధికార వర్గాలతో కేంద్రంలోని అధికారులు లోతుగా చర్చించారు. ‘గృహాల లిస్టింగ్, గణన’ కోసం ఏప్రిల్‌ నుంచి దేశంలోని ప్రతీ ఇంటికీ క్షేత్రస్థాయి సిబ్బంది ఎలా వెళ్లాలి? ఇంటి యజమానులను ఏయే ప్రశ్నలు అడిగి, ఏ సమాచారం సేకరించాలి? మొబైల్‌ యాప్‌ను ఎలా వాడాలి? డిజిటల్‌గా సమాచారాన్ని యాప్‌లో పొందుపరచటం ఎలా? సిబ్బందిని రాష్ట్ర, జిల్లా, ఉప జిల్లా స్థాయుల్లో ఎలా వినియోగించాలి? అధికారులు ఎలా సమన్వయం చేసుకోవాలి? అనే అంశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రీ-టెస్ట్‌ ప్రక్రియ ద్వారా సిద్ధం చేసుకున్నారు.‘గృహాల లిస్టింగ్, గణన’ ముగిశాక రెండో విడత జనగణన మొదలవుతుంది. ఇందులో భాగంగా మనదేశంలోని మంచు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జనాభా లెక్కల ప్రక్రియను 2026 సెప్టెంబరు నుంచి అక్టోబరు 1 వరకు నిర్వహిస్తారు. ఈ జాబితాలో జమ్ముకశ్మీర్, లద్దాఖ్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ ఉన్నాయి. దేశంలోని అన్ని ఇతర ప్రాంతాల్లో జనగణన 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1 వరకు జరుగుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Srisailam: శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్

Samantha: ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను

గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌

విద్యుత్‌ స్తంభం ఎక్కిన ఎమ్మెల్యే.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే