హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??

Updated on: Dec 27, 2025 | 8:28 PM

ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు మిన్నంటాయి. 'హరిలో రంగ హరి' అంటూ హరిదాసుల రాకతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ధనుర్మాస పుణ్యం, సంక్రాంతి సంప్రదాయాలు కలగలిసి గ్రామాలు, పట్టణాల్లో ముగ్గులు, గొబ్బిళ్ళు, కోడిపందాలు, నోరూరించే పిండివంటలతో పండుగ వాతావరణం పండుతుంది. ఈ మాసం వైష్ణవ ఆలయాల్లో తిరుప్పావై పారాయణాలతో విశిష్టంగా ఉంటుంది.

ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. తల మీద అక్షయపాత్ర, చేతిలో చిడతలతో “హరిలో రంగ హరి” అంటూ హరిదాసులు పల్లె బాట వట్టారు. వీరు శివకేశవుల కీర్తనలు అలపిస్తూ ఇంటింటికి తిరుగుతుంటే వీధులన్నీ ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. కొందరు కాలినడకన , మరికొందరు వాహనాలపై తిరుగుతూ సాంప్రదాయాన్ని చాటుతున్నారు. పల్లెల్లో సంక్రాంతి వచ్చిందంటే చాలు.. కోడిపందాల రాయుళ్లు కోడిపుంజులను పోరుకు సిద్ధం చేస్తుంటారు. పల్లెలు,పట్టణాలు తేడా లేకుండా ప్రతి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు పెడుతుంటారు. వాటిలో గొబ్బిళ్ళు పెట్టి, పూలతో అలంకరిస్తుంటారు. పండుగ సమీపిస్తుందనగా మన తెలుగువారి ప్రాచీన సాంప్రదాయ పిండి వంటలైన అరిసెలు, సున్నుండలు, జంతికలు వంటివి వండుతారు. అమ్మమ్మలు, నానమ్మలు చేసే ఈ పిండివంటలు సంక్రాంతి సెలబ్రేషన్స్ లో హైలెట్. సంక్రాంతి సెలవులకు వచ్చే కుటుంబ సభ్యుకు ముఖ్యమైన చిరుతిళ్లు ఇవే. హిందూ సాంప్రదాయంలో ధనుర్మాసం విశిష్టమైనది. డిసెంబర్ మధ్య నుంచి జనవరి మధ్య వరకు ఉండే ఈ మాసాన్ని మార్గశిరమాసం అని కూడా అంటారు. విష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తాయని విశ్వాసం. ఇక ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమైన మహా భక్తురాలు ఆండాళ్ అమ్మ వారు. ఆమె చూపిన భక్తి మార్గమే ధనుర్మాసానికి ప్రాణం. ఈ మాసంలో వైష్ణవాలయాల్లో రోజూ తిరుప్పావై పారాయణం చేయటం ఆనవాయితీగా వస్తోంది. అటువంటి ఈ ధనుర్మాసం నెల రోజులూ గ్రామాలలో ఆలయాల వద్ద తెల్లవారుజామున భాజా భజంత్రీలు, కోలాటాలు, చలి మంటలు సందడి ఉంటుంది. ఈ నెల రోజులు గ్రామీణ ప్రాంతాల్లో పల్లెల్లో హరిదాసు సంకీర్తనలు వినిపిస్తాయి. శ్రీమహావిష్ణువుకు ప్రతినిధులే ఈ హరిదాసులు అంటారు పెద్దలు. హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మనం తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయి అనే నమ్మకం ఉంది. హరిదాసు… పరమాత్మతో సమానం. మనుషులు ఇచ్చే ధనధాన్యాలను అందుకుని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని దీవించే వారే హరిదాసులు. పండుగ నెల ధనుర్మాసంలో నెలరోజుల పాటు హరినామాన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరూ ఇచ్చే ధన, ధాన్య, వస్తు, వాహనాలను హరిదాసులు స్వీకరిస్తారు. సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయపాత్రను తమ శిరస్సుపై ధరిస్తారు. ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి తిరుప్పావై పఠించి, అక్షయపాత్రను ధరించి.. గ్రామ సంచారం చేస్తారు. గ్రామాల్లో, పల్లెలలో ఇంటింటికి తిరిగి.. తమ స్వగృహానికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరి ఏమీ మాట్లాడరు. అక్షయపాత్రను కిందకు దించరు. ఇంటికి వెళ్లాక ఆయన ఇల్లాలు.. అతడి పాదాలను కడిగి అక్షయపాత్రను కిందకు దించుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టులు

ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు

తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు

రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్‌ ఏం చేశాడో చూడండి

అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా