మహిళా రిజర్వేషన్ బిల్లుకు నా సపోర్ట్.. సీఎం మమతా బెనర్జీ సంచలన కామెంట్స్..

Updated on: Apr 18, 2026 | 10:02 AM

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరుపై సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, కేంద్ర ఏజెన్సీలు బీజేపీ జేబు సంస్థల్లా మారిపోయాయని సంచలన ఆరోపణలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆమె వ్యూహం ఏంటి? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థ ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆమె, బీజేపీ కేవలం అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పని చేస్తోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తన పూర్తి మద్దతును మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ బిల్లు ఇప్పటికే ఆమోదం పొందిందని, దీనిని వెంటనే అమలు చేయవచ్చని ఆమె తెలిపారు. అయితే ఈ బిల్లు అమలులో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం జాప్యం చేస్తోందని ఆమె ఆరోపించారు. బీజేపీకి యువత, మహిళలు, రైతులు, కార్మికుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదని మమత వ్యాఖ్యానించారు.

ఎన్నికల వ్యూహాలపై తీవ్ర ఆరోపణలు

ఎన్నికల ప్రక్రియను బీజేపీ అపహాస్యం చేస్తోందని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఓటర్ల జాబితా నుండి పేర్లను తొలగించడానికి బీజేపీ కుట్ర చేస్తోందని, ఇది వారి వ్యూహంలో భాగమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈడీ, సీబీఐ, ఐటీ, కస్టమ్స్ వంటి కేంద్ర ఏజెన్సీలను బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని మమత ఆరోపించారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని, బీజేపీ ఆదేశాల మేరకే పని చేస్తోందని విమర్శించారు. బెంగాల్‌లో ఎన్నికల సమయంలో 500 మందికి పైగా అధికారులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడంపై ఆమె నిలదీశారు.

Published on: Apr 18, 2026 09:56 AM
Loading...
Unable to load recommendations.
Follow Us