గ్యాస్‌ వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌! జూన్ 30 లాస్ట్‌ డేట్‌ ఏం చేయాలంటే?

Updated on: Jun 20, 2026 | 2:49 PM

ఎల్‌పీజీ వినియోగదారులు జూన్ 30లోగా eKYC పూర్తి చేసుకోవాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఉజ్జ్వల పథకం లబ్ధిదారులు, ఇంకా eKYC చేయని వినియోగదారులు ఆధార్ ఆధారిత ధృవీకరణ పూర్తి చేయకపోతే సబ్సిడీ జమలో అంతరాయం కలగొచ్చని హెచ్చరించాయి. ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు యాప్‌లు లేదా గ్యాస్ ఏజెన్సీల ద్వారా ఈ ప్రక్రియను ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు.

మీకు ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ ఉందా? మీరు గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌పై.. ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతున్నారా? అయితే మీకో బిగ్‌ అలర్ట్..!ప్రముఖ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) గ్యాస్ కస్టమర్ల కోసం ఒక కొత్త అడ్వైజరీ జారీ చేసింది. ముఖ్యంగా ఉజ్జ్వల పథకం లబ్ధిదారులతో పాటు సబ్సిడీ పొందుతున్న సాధారణ గ్యాస్ వినియోగదారులు జూన్ 30 లోగా తమ ఈ-కేవైసీ (eKYC) ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఒకవేళ గడువు లోగా ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే.. ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ కస్టమర్లు తమ గ్యాస్ సబ్సిడీని కోల్పోయే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇందులో భాగంగానే ఎల్‌పీజీ సిలిండర్ వినియోగదారులందరికీ ఆధార్ ఆధారిత ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. కాబట్టి డెడ్‌లైన్ లోపే ఈ పని పూర్తి చేయాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇక, ఎల్‌పీజీ ఈ-కేవైసీ ఎందుకు తప్పనిసరి చేశారు? అనే విషయానికొస్తే, ఫిబ్రవరి చివరి వారంలో ఇరాన్‌పై యూఎస్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వం రకరకాల కొత్త రూల్స్ తీసుకొస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆయిల్, గ్యాస్ రవాణాలో 20 శాతం వాటా ఉండే అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ మూతపడటంతో ఎల్‌పీజీ సరఫరాలో కొరత ఏర్పడింది. ఈ కొరతను అధిగమించడానికి, సబ్సిడీ దుర్వినియోగం కాకుండా చూడటానికి ప్రభుత్వం ఎల్‌పీజీ కనెక్షన్లకు ఆధార్-బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను మ్యాండేటరీ చేసింది. అయితే, మార్చి నెలలో ఉజ్వల యోజన లబ్ధిదారులకు దీనిని తప్పనిసరి చేయగా, తాజా ఆదేశాల ప్రకారం ఇప్పటివరకు ఈ-కేవైసీ చేసుకోని ప్రతి ఎల్‌పీజీ వినియోగదారుడు దీనిని నెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. మీరు నాన్-ఉజ్వల కస్టమర్ అయి ఉండి, ఇదివరకే కేవైసీ చేసి ఉంటే మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకీ, ఇండియన్ ఆయిల్ ఇచ్చిన కొత్త అడ్వైజరీ ఏంటి..? జూన్ 12న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, “ఎలాంటి బ్రేక్స్ లేకుండా మీ ఎల్‌పీజీ సబ్సిడీ బెనిఫిట్స్ కంటిన్యూ అవ్వాలంటే వెంటనే ఈ-కేవైసీ చేయండి” అని కోరింది. జూన్ 30 లోగా ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని, ఇది చాలా సింపుల్, సేఫ్ అండ్ కంప్లీట్‌గా ఫ్రీ అని స్పష్టం చేసింది. మరి, ఈకేవైసీ ఎలా చేసుకోవాలి..? మీరు ఇండేన్ గ్యాస్ కస్టమర్లు అయితే ఇండియన్ ఆయిల్ వన్ యాప్, ఆధార్ ఫేస్ ఐడీ యాప్‌ల ద్వారా eKyc పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా భారత్ గ్యాస్ వినియోగదారులు అయితే హలో బీపీసీఎల్ యాప్‌ ద్వారా, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు అయితే హెచ్‌పీ పే యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే కేవైసీ చేసుకోవచ్చు. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబరు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం, ఆధార్ ఫేస్ ఐడీ యాప్ ద్వారా మీ ఫేస్ చూపించడం ద్వారా కేవైసీ పూర్తవుతుంది. అయితే ఇదివరకే మీరు కేవైసీ పూర్తి చేసి ఉంటే మళ్లీ అవసరం లేదు. ఇక, గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయని వారు వెంటనే తమ పరిధిలోని గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి ఈ ప్రక్రియను ఫ్రీగా పూర్తి చేసుకోవాలి. కేంద్రం ఉజ్జ్వల పథకం కింద ప్రతి సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ ఇస్తుండగా, మిగిలిన అర్హులైన సాధారణ వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో స్వల్ప మొత్తంలో సబ్సిడీ జమ అవుతోంది. మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. రాష్ట్రంలో సుమారు 1.26 లక్షలకు పైగా క్రియాశీలక గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలు బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోని వారి వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా పంచుకోనున్నాయి. మొత్తంగా, జూన్ 30 లోగా eKYC పూర్తి చేసుకుంటేనే ఎలాంటి అంతరాయం లేకుండా సబ్సిడీ డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇక పై డాక్టర్ చిట్టీ ఉంటేనే దగ్గు మందు! కాఫ్‌ సిరప్ కు బానిసగా యూత్‌.. చిన్నారుల ప్రాణం తీసే సిరప్!

సహారాలోనూ తప్పని ఆన్‌లైన్‌ మీటింగ్‌! ఒంటెపై ల్యాప్‌టాప్‌తో..

ఏంటి ఈ సరికొత్త ఆన్‌లైన్‌ షాపింగ్‌ విధానం?

ఇది కదా సంపాదనంటే! ఒక్క రీల్‌కు రూ.80 లక్షలు..

రేయ్‌ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!

Follow Us