విమాన టికెట్ ధర.. ఇక ఫిక్స్..
విమాన టికెట్ ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఉదయం ఉన్న ధర సాయంత్రానికి పెరగవచ్చు.. తగ్గవచ్చు. ఈ అనిశ్చితితో విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇకపై ఇలాంటి సమస్యలు లేకుండా విమాన ప్రయాణికులకు ప్రభుత్వ రంగ సంస్థ అలయన్స్ ఎయిర్ గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ ధరల ఒత్తిడి నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తూ 'ఫేర్స్ సే ఫుర్సత్' అనే వినూత్న పథకాన్ని ప్రారంభించింది.
సోమవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా, అలయన్స్ ఎయిర్ ఛైర్మన్ అమిత్ కుమార్, సీఈఓ రాజర్షి సేన్ హాజరయ్యారు. ఈ పథకం ప్రత్యేకతలు ఏంటంటే.. బుకింగ్ తేదీతో సంబంధం లేకుండా టికెట్ ధర స్థిరంగా ఉంటుంది. చివరి నిమిషంలో, అంటే ప్రయాణించే రోజున టికెట్ కొనుగోలు చేసినా అదే ధర వర్తిస్తుందని అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్‌గా అక్టోబర్ 13 నుంచి డిసెంబర్ 31 వరకు ఎంపిక చేసిన కొన్ని మార్గాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన, కార్యాచరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం భారత విమానయాన రంగంలో ‘డైనమిక్ ప్రైసింగ్’ విధానం అమల్లో ఉంది. దీనివల్ల డిమాండ్, పండగ సీజన్లు, పోటీని బట్టి టికెట్ ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇది ప్రయాణికులకు, ముఖ్యంగా చివరి నిమిషంలో ప్రయాణించేవారికి తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించి, ధరలలో పారదర్శకత, స్థిరత్వం తీసుకురావడమే ‘ఫేర్స్ సే ఫుర్సత్’ ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా, ఉడాన్ పథకం స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు విమానయానాన్ని అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం. ఒకే మార్గం, ఒకే ధర అనే సాహసోపేతమైన అడుగు వేసిన అలయన్స్ ఎయిర్‌ను అభినందిస్తున్నాను. ఇది లాభాపేక్షను పక్కనపెట్టి, ప్రజాసేవకు ప్రాధాన్యత ఇవ్వడమే అని అన్నారు. ఈ స్థిర ధరల విధానం వల్ల చిన్న పట్టణాల నుంచి మొదటిసారి విమానమెక్కేవారి సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్షణాల్లో కుప్పకూలిన కొత్త హైవే.. షాకైన జనం
ఇక.. రైలు టికెట్ ఇంటికే డెలివరీ
జపాన్‌ను వణికిస్తున్న మహమ్మారి.. ఆసియా అంతటా హై అలర్ట్
ఇక.. సులభంగా ఈపీఎఫ్ విత్ డ్రా.. ఎమర్జెన్సీలో 100 శాతం తీసుకోవచ్చు
