చిరు వ్యాపారులకు అమెజాన్‌ బిగ్‌ ఆఫర్‌

Updated on: Jan 29, 2026 | 7:20 AM

సొంతంగా ఉత్పత్తులు తయారు చేసి స్థానిక వినియోగదారులకు విక్రయిస్తున్న చిన్న వ్యాపారులు, చేతివృత్తి కళాకారులు, స్టార్టప్‌లకు అమెజాన్ శుభవార్త చెప్పింది. ఈ–కామర్స్ రంగంలో పనిచేస్తున్న ఇండిపెండెంట్ విక్రేతలకు సరికొత్త అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలాంటి కోడింగ్ పరిజ్ఞానం అవసరం లేకుండా, ఉచితంగా స్వంత వెబ్‌సైట్‌ను రూపొందించుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది.

ఈ అవకాశాన్ని కల్పించేందుకు అమెజాన్ ‘స్మార్ట్‌బిజ్’ అనే ప్రత్యేక టూల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా వస్తువులు, సేవలను విక్రయించే వ్యాపారులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేలా ప్రత్యేక వెబ్‌సైట్‌ను సులభంగా రూపొందించుకోవచ్చు. వెబ్‌సైట్ హోస్టింగ్, పేమెంట్ గేట్‌వేలు, ఆర్డర్ మేనేజ్‌మెంట్ వంటి సౌకర్యాలతో పాటు కీలకమైన లాజిస్టిక్ సపోర్ట్ కూడా అమెజాన్ అందిస్తోంది. కరోనా తర్వాత ఇంటి నుంచే పని చేసే వారు, హోమ్‌మేడ్ ఉత్పత్తులు తయారు చేసే వారు బాగా పెరిగారు. పెయింటింగ్స్, హస్తకళలు, ఆహార పదార్థాలు వంటి ఉత్పత్తులతో చాలా మంది స్థానిక మార్కెట్‌కే పరిమితమయ్యారు. ఇప్పుడు ‘స్మార్ట్‌బిజ్’ ద్వారా తమ వ్యాపార పరిధిని విస్తరించుకునే అవకాశం కలుగుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారులు డైరెక్ట్–టు–కస్టమర్ మోడల్‌లోకి ప్రవేశించేందుకు ఇది మంచి వేదికగా మారనుంది.