Loading video

మరో భార్యా బాధితుడి ఆవేదన వీడియో

|

Mar 24, 2025 | 3:18 PM

టెక్‌సిటీ బెంగళూరులో భార్యా బాధితులు పెరిగిపోతున్నారా? బెంగళూరుకు చెందిన శ్రీకాంత్‌ , బిందుశ్రీ దంపతులు ఒకరిపై ఒకరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోవడాన్ని చూస్తే.. ఇలాంటి కేసులు పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఈ కేసు సంచలనం రేపుతోంది. రెండేళ్ల క్రితం వీళ్లిద్దరికి వివాహం జరిగింది. అయితే ఇప్పటి వరకు బిందుశ్రీ తనతో కాపురం చేయలేదని , డబ్బుల కోసం వేధిస్తోందని ఆరోపించాడు శ్రీకాంత్‌ . డబ్బులు ఇవ్వకపోతే దాడి చేస్తునట్టు ఆరోపించాడు.

బిందుశ్రీతో పాటు ఆమె కుటుంబ సభ్యులు దాడి చేయడంతో తనకు తీవ్ర గాయాలైనట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. తనకు 60 ఏళ్ల వరకు పిల్లలు అవసరం లేదని వాదిస్తోందని తెలిపాడు. తాను వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ చేస్తున్నానని , కాని తనను పదే పదే డిస్టర్బ్‌ చేయడంతో ఏడాది రూ. 60 లక్షల ఆదాయం వచ్చే ఉద్యోగాన్ని కోల్పోయినట్టు తెలిపాడు.ఈ విషయంలో బిందుశ్రీ వెర్షన్‌ మరోలా ఉంది. శ్రీకాంత్‌ ఆరోపణల్లో నిజం లేదని అంటున్నారు బిందూశ్రీ. తనను శ్రీకాంతే వేధించాడని ఆరోపించారు. రూ. 45 లక్షల కోసం తాను డిమాండ్‌ చేయలేదని , తన తండ్రి చేసిన పెళ్లి ఖర్చును తిరిగి ఇవ్వాలని మాత్రమే కోరినట్టు తెలిపారు. తన భర్త చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని , ఇంట్లో సరదాగా డ్యాన్స్‌ చేస్తుంటే వీడియో తీసి వైరల్‌ చేశాడని శ్రీకాంత్‌పై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. శ్రీకాంత్‌ ఇచ్చిన ఫిర్యాదుతో బిందూశ్రీపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్టేషన్‌కు పిలిపించి ఆమెను విచారించారు. అయితే ఇద్దరిలో ఎవరు నిజం చెబుతున్నారో.. ఎవరు అబద్దం చెబుతున్నారో అర్ధం కావడం లేదంటూ పోలీసులు తలలు పట్టుకున్నారు.