Andhra: అయ్యో రైతన్న.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి..
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు.. కానీ ఇప్పుడు అదే ఉల్లి.. రైతులను కన్నీళ్లు పెట్టిస్తోంది. భారీగా దిగుబడి ఉన్నా గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు అన్నదాతలు. కళ్ల ముందే పంట కుళ్లిపోతుండటంతో కూలీ ఖర్చులు కూడా రావడం లేదంటూ పారబోసేస్తున్నారు. అసలు ఉల్లి రైతులకు ఈ కష్టాలు ఎందుకు?..రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ ఏంటి?
ఉల్లి కోస్తేనే కాదు.. సాగు చేసినా కన్నీళ్లు పెట్టిస్తోంది. ఏపీలో ధర పాతాళానికి పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎకరాకు లక్ష రూపాయలకుపైగా ఖర్చు పెట్టినా కనీసం 20 శాతం కూడా తిరిగి రాకపోవడంతో ఆవేదనలో మునిగిపోయారు రైతులు. కిలో ఉల్లి 6 రూపాయలు, కొన్ని చోట్ల 2 రూపాయలే పలుకుతోంది. కనీసం కూలీల ఖర్చులు కూడా రావడం లేదంటూ రైతులు వాపోతున్నారు. ఏపీలో ఉల్లి పంటకు కేంద్రంగా ఉన్న కర్నూలులో పంటను అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వందల క్వింటాళ్ల నిల్వలు మార్కెట్ యార్డులో పేరుకుపోయాయి.. ఓ పక్క పంట కుళ్లిపోవడం, మరోవైపు గిట్టుబాట ధర లేక పంటను మొత్తం పారబోయాల్సిన పరిస్థితి వచ్చింది. ఉల్లి రైతుల గోసను చూసి సీఎం చంద్రబాబు ఎట్టకేలకు స్పందించారు. క్వింటాల్‌కు 12 వందల రూపాయల ధర ప్రకటించారు. ఉత్తర్వులు వెంటనే అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో రైతులు ఊరట పడ్డారు. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. కర్నూలులో కేవలం మూడు రోజులు మాత్రమే మార్క్‌ఫెడ్ కొనుగోలు జరిపింది. తర్వాత ఉల్లి నిల్వలు ఎక్కువగా ఉండటంతో నిలిపేశారు.
కర్నూలు మార్కెట్ యార్డులో వ్యాపారులు, మార్క్‌ఫెడ్ కలిసి కొనుగోలు చేసేలా కొత్త విధానాన్ని తెరపైకి తేవడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ విధానంలో వ్యాపారులు సరిగ్గా ఉల్లిని కొనగోలు చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం పంటను నేరుగా మార్క్‌ఫెడ్ అధికారులే కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో ఉల్లి ధర 200 నుంచి 500 రూపాయలకు ధర మించడం లేదు. దీంతో రైతులు ఉల్లిపారబోసి నిరసన తెలిపారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది వేలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి వైసీపీ సహా వామపక్షాలు రైతులకు మద్దతు తెలిపాయి పరిస్థితి చేయి దాటి పోకుండా ఉండేందుకు జాయింట్ కలెక్టర్ రైతుల వద్దకు వచ్చి 1200 గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
ఉల్లి ధరలు పడిపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని విమర్శించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కర్నూలు మార్కెట్ యార్డును సందర్శించిన షర్మిల.. ఈ అంశంలో కూటమి, వైసీపీ పార్టీలు రాజకీయాలు చేయడాన్ని తప్పుబట్టారు. ఎన్నికల సమయంలో ఉల్లి రైతులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని, క్వింటాకు 1,200 రూపాయల మద్దతు ధర ఇస్తామని చెప్పినా, ఒక్క రైతుకు కూడా ఈ మొత్తం అందలేదని ఆరోపించారు.
వ్యయ ప్రయాసలకోర్చి దిగుబడిని మార్కెట్‌కు తెస్తే కోనేవారే కరువయ్యారని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కనీసం పంట పెట్టుబడి ఖర్చులైనా వచ్చేలా చూడాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కూటమి సర్కార్ ఉల్లి రైతులను ఏ విధంగా ఆదుకుంటుందో వేచి చూడాలి.
