హార్ట్ పేషెంట్లకే కాదు… స్ట్రోక్ పేషెంట్లకూ ‘స్టెంట్’!
"సూపర్‌నోవా స్టెంట్" స్ట్రోక్ రోగులకు కొత్త ఆశాకిరణం. ఢిల్లీ AIIMS నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ఇది అత్యంత సురక్షితమైనది, ప్రభావవంతమైనదని తేలింది. రక్తం గడ్డకట్టడాన్ని తొలగించి, మెదడుకు రక్త ప్రవాహాన్ని పునరుద్ధరిస్తుంది. 'మేక్-ఇన్-ఇండియా'లో భాగంగా అభివృద్ధి చేసిన ఈ స్టెంట్ తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. ఇది పక్షవాతం చికిత్సలో కీలక మలుపు.
సాధారణంగా హృద్రోగ బాధితులకు స్టెంట్ లు వేస్తుంటారు. ఇప్పుడు స్ట్రోక్ పేషెంట్లకు కూడా స్టెంట్ అందుబాటులోకి వచ్చింది. పక్షవాతం బారినపడిన రోగుల చికిత్సలో ‘సూపర్‌నోవా స్టెంట్’ అనే అధునాతన వైద్య పరికరం సురక్షితమని, అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని ఢిల్లీ ఎయిమ్స్ నిపుణులు శనివారం వెల్లడించారు. ఈ పరికరంపై నిర్వహించిన దేశపు మొట్టమొదటి క్లినికల్ ట్రయల్‌కు ఎయిమ్స్ నేతృత్వం వహించింది. ‘గ్రాస్‌రూట్’ పేరుతో దేశంలో మొత్తం ఎనిమిది కేంద్రాల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్‌లో భాగంగా, రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించే థ్రాంబెక్టమీ ప్రక్రియలో ఈ స్టెంట్ వాడగా.. మెదడులో రక్త ప్రవాహాన్ని విజయవంతంగా పునరుద్ధరించింది. ఈ ప్రయోగం తర్వాత మెదడులో రక్తస్రావం, మరణాల రేటు చాలా తగ్గటంతో బాటు చికిత్స పొందినవారిలో సగం మంది 3 నెలలలో సాధారణ జీవితాన్ని గడపగలిగారు. గ్రావిటీ మెడికల్ టెక్నాలజీ సంస్థ ‘మేక్-ఇన్-ఇండియా’లో భాగంగా అభివృద్ధి చేసిన ఈ స్టెంట్‌ను ప్రత్యేకంగా భారతీయ రోగుల కోసం రూపొందించారు. గ్రాస్‌రూట్ ట్రయల్ డేటా ఆధారంగా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇప్పటికే దీని వినియోగానికి ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఆగ్నేయాసియాలో 300 మంది రోగులకు ఈ పరికరంతో చికిత్స అందించామని, భారత్‌లో తక్కువ ధరకే ఈ చికిత్స అందుబాటులోకి రాబోతోందని మయామి యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ దిలీప్ యవగళ్ వెల్లడించారు. భారత్‌లో ఏటా 17 లక్షల మంది పక్షవాతం బారిన పడుతున్నారని, వారి చికిత్సలో ‘సూపర్‌నోవా స్టెంట్’ బాగా అక్కరకు రాబోతోందని ఢిల్లీ ఎయిమ్స్ నిపుణులు తెలిపారు. ‘సూపర్‌నోవా స్టెంట్’ పై నిర్వహించిన దేశపు తొలి క్లినికల్ ట్రయల్‌కు ఎయిమ్స్ నేతృత్వం వహించింది. “ఈ ట్రయల్ భారత్‌లో స్ట్రోక్ చికిత్సలో ఒక కీలక మలుపు. తీవ్రమైన పక్షవాతం కేసుల్లో సూపర్‌నోవా స్టెంట్ అద్భుతమైన భద్రత, సామర్థ్యాన్ని చూపించింది” అని ఎయిమ్స్ న్యూరోఇమేజింగ్ విభాగాధిపతి, ట్రయల్ నేషనల్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ శైలేష్ బి. గైక్వాడ్ తెలిపారు. ఈ అధ్యయన ప్రాథమిక ఫలితాలు ‘జర్నల్ ఆఫ్ న్యూరోఇంటర్వెన్షనల్ సర్జరీ’లో ప్రచురితమయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 2026 రైల్వే జాబ్ క్యాలెండర్ రెడీ
BSNL బ్రాడ్‌బాండ్ ఫ్లాష్ సేల్.. బెనిఫిట్స్ ఇవే
ఇప్పుడే కొనేయండి.. కొత్త సంవత్సరంలో వాయింపే
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా? సొమ్ము చేసుకున్న విదేశీ బ్రాండ్