భారత్‌లోనే 2030 కామన్వెల్త్ గేమ్స్… నవంబరు 26నే అధికారిక ప్రకటన

Updated on: Oct 16, 2025 | 8:39 PM

భారత్ మరోసారి కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2030 సంవత్సరంలో జరిగే కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు అహ్మదాబాద్‌ వేదిక కానుంది. ఇప్పటికే ఈ విషయాన్ని కామన్‌వెల్త్‌ బోర్డు ప్రతిపాదించగా, నవంబర్‌ 26వ తేదీన సమావేశంలో తుదినిర్ణయం దీనిపై అధికారిక ప్రకటన రానుంది. 2030 కామన్వెల్త్‌ క్రీడల నిర్వహణకు నైజీరియాలోని అబుజా సైతం పోటీ పడుతోంది.

ఎగ్జిక్యూటివ్‌ బోర్డు మాత్రం అహ్మదాబాద్‌ను సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించింది. అన్ని అనుకున్నట్లు జరిగితే కామన్వెల్త్‌ గేమ్స్‌కు భారత్ రెండోసారి ఆతిథ్యమివ్వనుంది. గతంలో 2010లో దిల్లీ వేదికగా ఈ క్రీడాపోటీలు జరిగాయి. 2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించేందుకు భారత్ బృందం లండన్‌లోని కామన్వెల్త్ క్రీడల మూల్యాంకన కమిటీకి సెప్టెంబర్ 23న అధికారికంగా తన ప్రతిపాదనను సమర్పించింది. కామన్వెల్త్ గేమ్స్ అసోసియేషన్ (ఇండియా) అధిపతి, భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పి.టి. ఉష మాట్లాడుతూ, శతాబ్ది కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడం భారతదేశానికి అసాధారణ గౌరవం అని అన్నారు. “ఈ క్రీడలు భారతదేశ ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్ సామర్థ్యాలను ప్రదర్శించడమే కాకుండా, 2047 వికసిత్ భారత్ వైపు మన జాతీయ ప్రయాణంలో అర్థవంతమైన పాత్ర పోషిస్తాయి” అని తెలిపారు. కామన్వెల్త్‌ క్రీడలు భారత్‌లో జరగనుండడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పందించారు. అహ్మదాబాద్‌లో నిర్వహించేందుకు కామన్వెల్త్‌ అసోసియేషన్‌ ఆమోదం తెలపడం గర్వించదగిన విషయమన్నారు. 2030 ఎడిషన్ చరిత్రాత్మక ప్రాముఖ్యం కలిగి ఉంది. అప్పటికి కామన్వెల్త్ క్రీడలు మొదలై సరిగ్గా 100 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఇక.. కామన్వెల్త్ క్రీడలలో భారత్ కు మంచి రికార్డులే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ క్రీడల్లో భారత్.. మొత్తం 564 పతకాలు సాధించగా, వాటిల 203 బంగారు, 190 రజత, 171 కాంస్య పతకాలున్నాయి. ఈ క్రీడల్లో.. ఆస్ట్రేలియా -2,596 పతకాలు, ఇంగ్లండ్‌ -2,322 పతకాలు సాధించి.. తొలి రెండు స్థానాల్లో ఉండగా, మనదేశం మూడో స్థానంలో ఉంది. 2030లో అహ్మదాబాద్‌కు ఆతిథ్యం వల్ల దేశ క్రీడా మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. కాగా, 2030లో శతాబ్ది కామన్వెల్త్ క్రీడలు మనదేశంలో జరగటంపై నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆలయ ప్రాంగణంలో వింత ఆకారం.. విద్యుత్‌ కాంతుల మధ్య ధగధగా మెరుస్తూ

ఆరు పదుల వయసులోనూ గుర్రంపై సవారీ.. అదుర్స్‌

కోతి చేతిలో నోట్ల కట్టలు.. చెట్టెక్కి చెలరేగిపోయిన వానరం

ప్రయాణీకులకు అలర్ట్.. రైళ్లలో అవి తీసుకెళ్తే రూ.1000 జరిమానా

చితిపై ఉంచగానే మృతదేహం నుంచి ఓంకారం