ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నా భారతీయులు కాదా? పౌరసత్వానికి అసలైన రుజువు ఏంటి?

Updated on: Jun 28, 2026 | 6:25 PM

ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ భారత పౌరసత్వానికి నేరుగా రుజువు కాదని కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన తాజా స్పష్టీకరణ దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఆధార్ వ్యక్తిగత గుర్తింపు కోసమేనని, కుటుంబ బంధాలకు లేదా పౌరసత్వానికి అది చట్టబద్ధ ఆధారం కాదని పేర్కొన్నాయి. పౌరసత్వ నిర్ధారణకు జనన ధ్రువీకరణ, ఇతర అధికారిక పత్రాలకే ప్రాధాన్యం ఉంటుందని వివరించాయి.

ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేసిన, తీవ్రమైన చర్చకు దారితీసిన ఒక అత్యంత కీలకమైన అంశం గురించి మాట్లాడుకుందాం. మీ జేబులో ఆధార్ కార్డు ఉందా? మీ ఇంట్లో పాస్‌పోర్ట్ ఉందా? అయితే మీకో షాకింగ్ న్యూస్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన తాజా వివరణలు వింటే.. “మరి మనం ఈ దేశ పౌరులమేనా? మన పౌరసత్వానికి అసలైన రుజువు ఏంటి?” అనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ రాక మానదు. అవును, మీరు విన్నది నిజమే. “ఆధార్ కార్డ్ అనేది కుటుంబ సంబంధానికి నిరూపణ కాదు” అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికంటే ముందే, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ “పాస్‌పోర్ట్ ఉన్నంత మాత్రాన మీరు భారతీయ పౌరులు కాబోరు” అని ఇచ్చిన క్లారిఫికేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద దుమారాన్ని రేపుతోంది. ప్రతిపక్ష నేతలు, మేధావులు, నెటిజన్లు అందరూ ఒక్కటే ప్రశ్నిస్తున్నారు—”అన్నింటికీ ఆధార్ లింక్ అడిగే ప్రభుత్వం, సుదీర్ఘ పోలీస్ వెరిఫికేషన్ తర్వాత పాస్‌పోర్ట్ ఇచ్చే అధికారులు.. ఇప్పుడు ఇవేవీ పౌరసత్వానికి పనికిరావు అంటే, మరి సామాన్య ప్రజలు తమ పౌరసత్వాన్ని ఎలా నిరూపించుకోవాలి?” అసలు ఆధార్ కార్డు పరిధి ఎంతవరకు? పాస్‌పోర్ట్ చట్టం 1967 ఏం చెబుతోంది? కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ వివరణ ఇచ్చింది? మొదటగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం గురించి మాట్లాడుకుందాం. విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్‌పోర్ట్ నిబంధనలపై క్లారిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో, యూపీ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ సేవలు, అధికారిక పనులలో ఇకపై ఆధార్ కార్డును కుటుంబ సంబంధాన్ని నిరూపించే అధికారిక పత్రంగా పరిగణించలేము అని స్పష్టం చేసింది. ఆధార్ అనేది కేవలం ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత గుర్తింపు, నివాస ధృవీకరణకు సంబంధించిన పత్రం మాత్రమే. మీ ఆధార్ కార్డు వెనుక భాగంలో ‘S/O’, ‘D/O’ లేదా ‘W/O’ అని ఉన్నంత మాత్రాన అది చట్టబద్ధంగా బంధుత్వాన్ని లేదా కుటుంబ సంబంధాలను ధృవీకరించే పత్రం కాబోదని యూపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియలో నిబంధనలను స్పష్టం చేసిన తర్వాత, క్షేత్రస్థాయిలో ఎలాంటి గందరగోళం ఉండకూడదనే ఉద్దేశంతో యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెలువరించింది. మరి కుటుంబ సంబంధాలను, అంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తితో ఉన్న తల్లి, తండ్రి, భర్త లేదా భార్య అనే బంధాన్ని నిరూపించడానికి దేనిని ప్రామాణికంగా తీసుకుంటారు? దీనికోసం రేషన్ కార్డ్, వివాహ ధృవీకరణ పత్రం, లేదా ప్రభుత్వం జారీ చేసిన ఇతర అధికారిక బంధుత్వ ధృవీకరణ పత్రాలను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మన దేశంలో అత్యంత ముఖ్యమైన, ప్రతి పనికీ లింక్ చేసే పత్రాలలో ఆధార్ కార్డ్ ఒకటి. పింఛన్ల నుంచి బ్యాంక్ ఖాతాల వరకు, సిమ్ కార్డుల నుంచి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల వరకు ఆధార్ అడుగుతారు. అయితే, ఆధార్ కార్డు పరిధి ఎంతవరకు? దేనికి ఇది చెల్లుతుంది? దేనికి చెల్లదు? అనే విషయాలపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన అత్యంత కీలకమైన స్పష్టతనిచ్చింది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసిన దాని ప్రకారం.. ఆధార్ కార్డ్ అనేది కేవలం ఒక వ్యక్తి యొక్క గుర్తింపును, నివాసాన్ని ధృవీకరించే బయోమెట్రిక్ ఆధారిత పత్రం మాత్రమే. ఇందులో మూడు ముఖ్యమైన పాయింట్లను మనం గమనించాలి. మొదటిది ఆధార్ అనేది మీ ముఖం, మీ వేలిముద్రలు, మీ కంటిపాప స్కాన్ ఆధారంగా ఒక వ్యక్తిని గుర్తించడానికి ఉపయోగపడే విశిష్ట సంఖ్య. ఇది మీరు ఫలానా చోట నివసిస్తున్నారని మాత్రమే చెబుతుంది. రెండో విషయం.. చాలా మంది ఆధార్ కార్డులో ఉన్న పేర్ల ఆధారంగా తాము ఫలానా వారి వారసులమని లేదా భార్యాభర్తలమని చట్టబద్ధంగా నిరూపించవచ్చని భావిస్తారు. కానీ, ఆధార్ కార్డ్‌ను కుటుంబ సంబంధాల నిరూపణకు చట్టబద్ధమైన పత్రంగా పరిగణించలేమని మంత్రిత్వ శాఖ స్పష్టంగా పేర్కొంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆధార్ కార్డును భారతీయ పౌరసత్వానికి నిరూపణగా ఉపయోగించడానికి వీల్లేదు. పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియలో లేదా ఇతర అధికారిక దౌత్యపరమైన విషయాలలో కేవలం ఆధార్ కార్డును మాత్రమే చూపించి ‘నేను భారత పౌరుడిని‘ అని క్లెయిమ్ చేయడం కుదరదు. మరి పౌరసత్వాన్ని లేదా కుటుంబ సంబంధాలను తల్లిదండ్రులు, భార్యాభర్తలు వంటి బంధాలను అధికారికంగా నిరూపించాల్సి వచ్చినప్పుడు చట్టబద్ధమైన ఏ పత్రాలను సమర్పించాలి? ప్రభుత్వం దీనికి పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, వివాహ ధృవీకరణ పత్రం, లేదా ప్రభుత్వం జారీ చేసిన ఇతర నిర్దిష్ట పౌరసత్వ పత్రాలను మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ సేవలు, దౌత్యపరమైన విధుల్లో ఎలాంటి గందరగోళం లేకుండా ఉండటం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పునరుద్ఘాటించింది. ఆధార్ కార్డు యొక్క ప్రాముఖ్యత కేవలం మీ వ్యక్తిగత గుర్తింపు వరకే పరిమితమని మనం గుర్తుంచుకోవాలి. అయితే కథ ఇక్కడితో ముగిసిపోలేదు. అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే.. భారతప్రభుత్వం జారీచేసిన పాస్‌పోర్ట్‌ ఉన్నంతమాత్రాన భారతీయ పౌరులు కాబోరని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణతో దేశవ్యాప్తంగా ఒక పెద్ద దుమారం రేగుతోంది. పౌరసత్వానికి ప్రాతిపదిక కానప్పుడు పాస్‌పోర్ట్‌ జారీకి అంతటి సంక్లిష్టమైన ప్రక్రియ, పోలీస్‌ వెరిఫికేషన్‌ వంటి సుదీర్ఘ వడబోత ప్రక్రియలు ఎందుకు అని సామాన్య ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 14వ ‘పాస్‌పోర్ట్‌ సేవా దివస్‌’ సందర్భంగా కేంద్ర విదేశాంగ శాఖ ఇచ్చిన వివరణతో ఈ వివాదం రాజుకుంది. ప్రభుత్వం ఏమందంటే: “పాస్‌పోర్ట్‌ అనేది భారతీయ పౌరసత్వానికి ఏ రకంగానూ గుర్తింపు కాబోదు. కేవలం అంతర్జాతీయ ప్రయాణాలకు వీలు కల్పిస్తూ జారీచేసిన అనుమతి పత్రంగానే పాస్‌పోర్ట్‌ను చూడాలి” అని. నిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వ వర్గాలు దీనిపై మరింత వివరణ ఇచ్చాయి. పౌరసత్వం నిర్ధారణకు పాస్‌పోర్ట్‌ను ప్రామాణికంగా తీసుకోకూడదు అనే నిర్ణయం నిన్న మొన్న తీసుకున్న నిర్ణయం కాదు. మోదీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయం అసలే కాదు. పాస్‌పోర్ట్‌ చట్టం, 1967 లోని సెక్షన్ల ప్రకారం కొన్ని ప్రత్యేక సందర్భాలలో పౌరులుకాని వ్యక్తులకూ పాస్‌పోర్ట్‌లు జారీ చేయవచ్చు. గతంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఏరకంగా చూసినా పాస్‌పోర్ట్‌ అనేది పౌరసత్వానికి ఒక రుజువుగా ప్రభుత్వం ఏనాడూ పరిగణించలేదు. ఇప్పటికే పాస్‌పోర్ట్‌ సంపాదించినంత మాత్రాన వాళ్లకు పౌరసత్వం వచ్చేసిందని భావించకూడదు. పాస్‌పోర్ట్‌ అనేది పౌరసత్వానికి రుజువు కాదు అని 2013లో బాంబే హైకోర్టు సైతం గతంలో పలు తీర్పుల్లో స్పష్టంచేసింది. కానీ, ఈ వివరణపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆధార్, ఓటరు కార్డు, పాస్‌పోర్టు ఇవేవీ పౌరసత్వానికి గుర్తింపు కాకపోతే మరి అసలైన గుర్తింపు ఏమిటి? అన్నింటికీ ఆధార్‌ కార్డును ప్రామాణికం చేసినప్పుడు పౌరసత్వానికి ఎందుకు చేయడం లేదు? అని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లిన వ్యక్తులను అక్కడి పోలీసులు లేదా అధికారులు ప్రశ్నించినప్పుడు అక్కరకొచ్చే ఏకైక ధ్రువీకరణ పత్రం పాస్‌పోర్ట్‌. అలాంటి పాస్‌పోర్ట్‌ స్వదేశంలో ఎందుకు జాతీయతకు రుజువుగా పనికిరాదనే చర్చ జరుగుతోంది. అయితే గతంలో ప్రభుత్వం ఇచ్చిన వివరణలను ఒకసారి పరిశీలిస్తే.. జనన ధ్రువీకరణ, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలను మాత్రమే పౌరసత్వాన్ని రుజువు చేసే అధికారిక పత్రాలుగా గుర్తిస్తామని గతేడాది కేంద్రం స్పష్టం చేసింది. జనన, మరణ ధ్రువీకరణ చట్టం– 1969 ప్రకారం నిర్ధేశిత అధికారులు మాత్రమే జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలి. ఒక వ్యక్తి నిర్దేశిత రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో నివసించారని నివాస ధ్రువీకరణ పత్రాలు నిర్ధారిస్తాయి. ఇవి మాత్రమే వాళ్లు భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని రుజువు చేస్తాయి. ఈ పత్రాలు లేని వారు తమ పౌరసత్వ నిర్ధారణకు సంబంధిత మున్సిపల్‌ లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆశ్రయించాల్సి ఉంటుంది అని కేంద్రం గతంలో స్పష్టంచేసింది. నిజానికి ఆధార్‌ , ఓటర్‌ ఐడీ కార్డు గుర్తింపు పత్రాలే తప్ప.. అవి పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రాలు కాదని కేంద్రం, కోర్టులు గతంలోనే స్పష్టం చేశాయి. ఇప్పుడు పాస్‌పోర్టు అంశంలోనూ అదే తరహా ప్రకటనతో.. అసలు భారతీయ పౌరసత్వాన్ని నిర్ధారించే ధ్రువపత్రాలు ఏమిటనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పాస్‌పోర్టు అనేది..ఒక వ్యక్తికి సంబంధించినది కాదని, ‘ఇది భారత ప్రభుత్వ ఆస్తి’ అని పాస్‌పోర్ట్ వెనక స్పష్టంగా ఉంటుందని, ప్రభుత్వం ఎప్పుడు ఆదేశించినా దాన్ని అప్పగించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక సర్‌.. ప్రక్రియపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా.. ఆధార్‌ కార్డు కేవలం వ్యక్తిగత గుర్తింపు పత్రం మాత్రమేనని, అది పౌరసత్వానికి ధ్రువీకరణ కాదని స్పష్టం చేసింది. మరోవైపు ఓటరు కార్డు కూడా కేవలం వ్యక్తిగత గుర్తింపు, ఓటు వేసే హక్కును వినియోగించుకునేందుకు మాత్రమే పరిమితమని కేంద్రం, కోర్టులు పలు సందర్భాల్లో స్పష్టం చేశాయి. దీనితో ప్రజల్లో గందరగోళం కనిపిస్తోంది. వీటన్నింటికీ పరిష్కారంగా ఏదైనా మెరుగైన గుర్తింపు కార్డు వ్యవస్థ ఉంటే బాగుండనే అభిప్రాయాలూ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చైనాకు కౌంటర్‌గా .. భారత్ అతి పెద్ద డ్యామ్‌ నిర్మాణం

జీతం రూ.లక్ష.. సేవింగ్స్ సున్నా.. ముంచుతున్నవి ఈ అలవాట్లే!

RAAKA: ‘రాకా’ తో హాలీవుడ్‌తో ఢీ! ది పాత్ బ్రేకర్ బన్నీ!

ఔను.. ముగ్గురితో నాకు ఎఫైర్ ఉంది ! ఒప్పుకున్న బిల్ గేట్స్‌

సీటుకోసం సమరం.. పాలిటిక్స్‌లో కాదు.. ఆర్టీసీ బస్సులో..

Follow Us