ఉపవాసంతో గుండె వ్యాధుల ముప్పు 135% ఎక్కువట
రోజులో 12 గంటల నుంచి 16 గంటలపాటు ఏమీ తినరు. ఏది తిన్నా మిగతా సమయంలోపే. ఇటీవల చాలా మంది బరువు తగ్గడం కోసం ఫాలో అవుతున్న పద్ధతి ఇది. వీరు సాయంత్రం 6 గంటల నుంచి మర్నాడు ఉదయం అల్పాహార సమయం దాకా ఏమీ తినరు. ఇలా 16 గంటలపాటు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేవారు హృద్రోగంతో మరణించే ముప్పు 135 శాతం ఎక్కువని అమెరికన్ పరిశోధకులు తేల్చారు.
12 నుంచి 14 గంటల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేవారితో పోలిస్తే ముప్పు ఎక్కువని తాజా అధ్యయనం పేర్కొంది. అమెరికా జాతీయ ఆరోగ్య, పోషకాల పరిశీలన సర్వే ఎన్‌హేన్స్ నుంచి సేకరించిన 19 వేల మంది డేటాను పరిశోధకులు నిశితంగా పరిశీలించారు. తక్కువ సమయం ఐఎఫ్ చేసినవారితో పోలిస్తే రోజులో ఎక్కువ సమయం ఏమీ తినకుండా ఉండేవారు హృద్రోగాల బారిన ఎక్కువగా పడినట్టు గుర్తించారు. కాబట్టి ఈ విధానాన్ని దీర్ఘకాలం అనుసరించేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సొంతంగా చేయకుండా.. వైద్యులను సంప్రదించాక పాటించాలని సూచించారు. గతంలో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో కూడా.. ఇలా రోజులో ఎక్కువ గంటలపాటు ఉపవాసం ఉండేవారు హృద్రోగాల బారిన పడే ముప్పు 91 శాతం ఎక్కువని తేలింది. రోజులో కేవలం 8 గంటలపాటు మాత్రమే తినడం హృదయ స్పందనలు సరిగా లేకపోవడం వంటి సమస్యలతో బాధపడేవారికి మంచిది కాదని బెంగళూరుకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ రంజన్ శెట్టి తెలిపారు. 16 గంటలపాటు ఉపవాసం ఉండడం వల్ల రక్తంలో చక్కెరస్థాయిలు తగ్గి, గుండె దడ, హృదయస్పందన రేటు పెరుగుతుందని గుండెపోటు బారిన పడే ముప్పు ఉందని హెచ్చరించారు. 16 గంటలపాటు ఏమీ తినకుండా.. ఆ సమయంలో రోజువారీ పనులు చేసుకోవాలని భావిస్తే.. రక్తసరఫరా చేయడానికి గుండె ఎక్కువగా కష్టపడాల్సి వస్తుందని అన్నారు. ,మధుమేహ బాధితులు,మూత్రపిండాలు, కాలేయం, గుండె వ్యాధులున్న వారు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకూడదని సూచించారు. ఒకవేళ అలాంటివారు ఐఎఫ్ చేయాలన్నా.. వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
