Telangana: వల బరువుగా అనిపిస్తే సరైన చేప చిక్కిందనుకున్నారు.. తీరా లాగి చూడగా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలం రోల్లపాడు గ్రామ చెరువులో మత్స్యకారులు వేసిన వలకు భారీ కొండచిలువ చిక్కి మృతి చెందింది. సుమారు 12 అడుగుల పొడవు, 50 కిలోల బరువు ఉన్న ఈ పాము చేపలు తినే క్రమంలో వలకు చిక్కుకుని ఊపిరాడక చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. టేకులపల్లి మండలం రోల్లపాడు గ్రామంలోని చెరువులో చేపల వేటకు వేసిన వలకు భారీ కొండచిలువ చిక్కి మృతి చెందింది. ప్రతిరోజులాగే స్థానిక మత్స్యకారులు చెరువులో చేపల కోసం వలలు వేసి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం చెరువు వద్దకు వెళ్లి వలలను లాగుతుండగా ఒక భారీ బరువైన వస్తువు తగిలినట్లు అనిపించింది. దీంతో జాలర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఏమైందో చూడాలనే ఉద్దేశంతో వలను ఒడ్డుకు లాగి పరిశీలించగా, అందులో సుమారు 12 అడుగుల పొడవు, దాదాపు 50 కిలోల బరువు ఉన్న కొండచిలువ చిక్కినట్లు గుర్తించారు. అయితే అప్పటికే ఆ కొండచిలువ మృతి చెందినట్లు కనిపించడంతో మత్స్యకారులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు దాని మృతిపై విచారణ చేపట్టారు. చెరువులో చేపలను తినే క్రమంలో వలకు చిక్కుకుని, బయటపడలేక ఊపిరాడక కొండచిలువ మృతి చెందిన ఉండొచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు.