Beautiful Love Story: లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. సాధారణంగా సినిమాల్లోనే ఈ మాట ఎక్కువగా వినిపిస్తుంది. నిజ జీవితంలో చాలామంది తొలిచూపు ప్రేమ అనే మాటలను పెద్దగా నమ్మరు. పట్టించుకోరు కూడా. అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఎంతో అందంగా ఉంటుంది. అదే తమ ప్రేమ బంధానికి గట్టి పునాది వేసిందంటున్నారు ఓ ప్రేమ జంట. పెళ్లిపీటల దాకా నడిపించిందని మురిసిపోతున్నారు. మరి ఆ ప్రేమకథేంటో, ఆ ప్రేమికులెవరో తెలుసుకుందాం రండి. మెక్సికోలోని మైకోకాన్‌లోని న్యూవో శాన్ జువాన్‌కు చెందిన లుజ్ యెసేనియా గెరోనిమో సెర్నా అనే యువతి 2009లో కార్లు కడుగుతున్న దుకాణం వెలుపల జువాన్ మెన్డోజా అల్విజార్ అనే యువకుడిని చూసింది. జువాన్ ఓ నిరాశ్రయుడు. ఓ కార్ల షోరూంలో పనిచేసేవాడు. కార్లు తుడుస్తూ బతుకీడ్చేవాడు. చింపిరి జుట్టు, మాసిన బట్టలతోనే వీధుల్లో తిరిగేవాడు. వచ్చిన డబ్బులతో పొట్ట నింపుకుని రోడ్లపై నిద్రపోయేవాడు. కానీ అతను చాలా సంస్కారవంతుడు. ఎదుటివారితో ఇట్టే కలిసిపోతాడు. ఇదే సెర్నాను ఆకట్టుకుంది. తొలిచూపులోనే అతనితో ప్రేమలో పడిపోయింది.
పదేళ్ల దాంపత్య బంధం..
జువాన్‌తో మాటకలిపిన లుజ్ మొదట అతడికి హెయిర్‌కట్ చేయించింది. హెయిర్ కట్ తర్వాత అతడి రూపమే మారిపోయింది. లుజ్ కళ్లకు జువాన్ ఓ సినిమాహీరోలా కనిపించాడు. అంతే అతనితో ప్రేమలో పడింది. ఇద్దరూ రెండేళ్ల పాటు ప్రేమలో మునిగితేలారు. ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి 2012లో జువాన్‌తో కలిసి ఏడడుగులు నడిచింది. వారి పదేళ్ల అన్యోన్య దాంపత్య బంధానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం జువాన్ తాపీ పనిచేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో మొబైల్ ఫోన్స్ రిపేర్లు చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ అందమైన ప్రేమ కథతోపాటు అప్పుడు వీధుల్లో సంచరిస్తున్న జువాన్ ఫొటోలను లుజ్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అవికాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారాయి. రోడ్డు పక్కన నిద్రించే ఓ నిరాశ్రయుడిని ప్రేమించి పెళ్లాడి అతనికి కొత్త జీవితం ప్రసాదించిన లుజ్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘నువ్వు రాణివి.. అతడిని నీ జీవితంలోకి ఆహ్వానించి మంచి లైఫ్ ఇచ్చావ్. నిజమైన ప్రేమ ఇలాగే ఉంటుంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. (Source)
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..